Shantaram Naik
-
రాహుల్ స్పీచ్ అదిరిపోయింది.. రిజైన్ చేశా
సాక్షి, పనాజీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాటలు తనను అమితంగా ఆకర్షించాయని, అందుకే తాను పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్నానని గోవా కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేసిన శాంతారాం నాయక్ అన్నారు. యువ నాయకత్వానికి పార్టీ సీనియర్లే మార్గం వేయాలని, వారికి రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీలో యువనాయకత్వాన్ని నింపాలని చెప్పిన రాహుల్ మాటలతో తాను మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పారు. అందుకే తన స్థానంలో యువ నాయకత్వానికి అవకాశం ఇచ్చేందుకు తాను పార్టీ చీఫ్ బాధ్యత నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ పార్టీలో సీనియర్లు తప్పుకొని యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. దాంతో గోవా కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న 71ఏళ్ల శాంతారాం నాయక్ తన బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ తన రాజీనామా లేఖను ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీకి పంపించానని, అలాగే, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి మరో లేఖను పంపించినట్లు చెప్పారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని రాజ్‌బబ్బార్, గుజరాత్‌లోని భరత్‌సింహ సోలంకీ కూడా పార్టీ చీఫ్ బాధ్యతలకు రాజీనామా చేసి ఆ లేఖలు పంపించారని, అందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. రాహుల్ ఇచ్చిన పిలుపుమేరకు సీనియర్లు సానుకూలంగా స్పందిస్తూ సహకరిస్తున్నారని, ఇది చాలా మంచి పరిణామం అని ఆయన తెలిపారు. 'రాహుల్ మాటలు నన్ను ఎంతో ఆకర్షించాయి. ఆ క్షణంలోనే రాజీనామా చేద్దామనుకున్నాను. అయితే, ఒక విశిష్టకార్యక్రమం జరుగుతున్న సమయంలో రాజీనామా చేయడం సబబు కాదని ఆగాను. అయితే, నా స్థానంలో ఎవరు వస్తారనే విషయం మాత్రం నేను చెప్పను. ఎందుకంటే అది పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అయితే, కనీసం పదేళ్లపాటు పార్టీకోసం పనిచేసిన యువకుడిని పెడితే బాగుంటుందని మాత్రమే నా ఉద్దేశం. రాష్ట్ర పార్టీ సారథిగా వచ్చే వారికి పార్టీపై ప్రేమ, అంకితభావం ఉండాలి. రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో యువతి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు' అని ఆయన చెప్పారు. -
సర్జికల్ స్ట్రైక్స్ పై ‘ఆయన’కు నో ఐడియా
సాక్షి, పనాజీ: యూరీ దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి ముష్కరులను మట్టుపెట్టింది భారత సైన్యం. ఆ సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ నేతృత్వంలోనే ఈ మెరుపు దాడి జరిగిందన్న విషయం విదితమే. అయితే దీనిపై గొప్పలు చెప్పుకున్న పారికర్‌కు, సర్జికల్ స్ట్రైక్స్‌పై కనీస అవగాహన కూడా లేదంటోంది కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన గోవా ముఖ్యమంత్రిగా తిరిగి పగ్గాలు చేపట్టి, త్వరలో జరగబోయే పనాజీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీచేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు శాంతారామ్ నాయక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పారికర్‌పై మాటల తూటాలు పేల్చారు. ‘సర్జికల్ దాడుల గురించి పారికర్‌కు ఏం తెలీదు. జాతీయ భద్రతా విభాగం, ప్రధాని కార్యాలయ సిబ్బంది మాత్రమే అందులో పాల్గొన్నారు. తర్వాతే పారికర్‌కు ఆ విషయం తెలిసింది. అయినప్పటికీ ఆ గొప్పతనం అంతా తనది, మోదీది, వాళ్లను తీర్చిదిద్దిన ఆర్ఎస్ఎస్దంటూ పారికర్ చెప్పుకుని తిరిగాడు. ఇక్కడి రాజకీయాలకు భయపడే కేంద్రానికి వెళ్లాడు. అక్కడా రక్షణ మంత్రిగా విఫలం కావటంతో తిరిగి రాష్ట్రానికి పంపించేశారు. కానీ, అసలు ఆయన గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలకే పారికర్ అనర్హుడు’ అని నాయక్ పేర్కొన్నారు. గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పారికర్ ఆగస్టు 23న జరగబోయే పనాజీ ఉప ఎన్నిక బరిలో దిగుతున్నారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి గిరీశ్ చోదంకర్, గోవా సురక్ష మోర్చా పార్టీ తరపున ఆనంద్ శిరోద్కర్ పోటీ చేస్తున్నారు. -
రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయండి: కవిత
పసుపు రైతులతో పార్లమెంటరీ వాణిజ్య కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: పసుపు రైతుల సమస్యలను పసుపు బోర్డు ఏర్పాటుతో పరిష్కరించవచ్చని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. వాణిజ్యంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ శనివారం హైదరాబాద్‌కు వచ్చింది. కమిటీ చైర్మన్ శాంతారామ్ నాయక్ నేతృత్వంలో కమిటీ ప్రతినిధులు వ్యవసాయ అనుబంధ శాఖలు, మార్కెటింగ్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ కమిటీ సభ్యురాలైన నిజామాబాద్ ఎంపీ కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో సాగువుతున్న పసుపులో 50 వేల ఎకరాలు తన పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోనే సాగవుతుందని వివరించారు. ఆర్థికంగా నష్టం వస్తున్నా రైతులు పసుపు సాగు వదులుకోలేక పోతున్నారని అన్నారు. దేశీయంగా పసుపు సాగుకు డిమాండ్ అధికంగా ఉన్నా, ఇతర దేశాల నుంచి పసుపును దిగుమతి చేసుకుంటున్న తీరును కవిత ఆక్షేపించారు. ఈ చర్య పసుపు సాగును మరింత సంక్షోభంలోకి నెడుతుందన్నారు. స్పైస్ బోర్డు ఈ విషయమై పునరాలోచించాలని కోరారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు ఆంధ్రా, విజయాబ్యాంకు ఎండీ, సీఎండీలతోనూ సమావేశమయ్యారు. పసుపు రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. కమిటీ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు స్పైస్ బోర్డు చైర్మన్ డాక్టర్ జయతిలక్ సమాధానమిచ్చారు. అనంతరం నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని పలువురు పసుపు రైతులు ఎంపీ కవిత నేతృత్వంలో కమిటీ ప్రతినిధులను కలిశారు. మద్దతు ధరగా రూ. 16,500 ఇవ్వాలి బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, ఆశన్నగారి జీవన్ రెడ్డి, కె.విద్యాసాగర్ రావులు వినతి పత్రాలు సమర్పించారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే పసుపు రైతులు ఆర్థిక నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి కమిటీకి సూచించారు. రూ. 16,500 కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించాలని కోరారు. ఎకరా పసుపు సాగుకు రూ. 1.10 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. సుగంధ ద్రవ్యాలు సాగు చేసే జిల్లాల్లో బోర్డు ప్రతినిధి.. సుగంధ ద్రవ్యాలు (స్పైస్) సాగు చేసే జిల్లాల్లో తమ ప్రతినిధిని ఒకరిని నియమిస్తా మని సుగంధ ద్రవ్యాల బోర్డు రాష్ట్ర ప్రభు త్వానికి హామీ ఇచ్చింది. ఈ విషయంపై వ్యవ సాయశాఖ కార్యదర్శి బోర్డు చైర్మన్‌కు విన్న వించారు. రాష్ట్ర స్థాయిలోనూ ఒక ప్రతినిధిని నియమిస్తామని బోర్డు స్పష్టం చేసిందని పార్థ సారథి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవ సాయ కమిషనర్ జగన్మోహన్, ఉద్యాన కమిష నర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, పరిశ్రమల కార్య దర్శి అహ్మద్ నదీమ్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి తదితరులు పాల్గొన్నారు. -
రాజ్‌నాథ్ సింగ్‌ను తొలగించండి..
న్యూఢిల్లీ: రాజ్యాంగ పీఠికలోని సోషలిస్ట్, సెక్యులర్ పదాలపై చెలరేగిన వివాదం పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా మరోసారి రాజుకుంది. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు శాంతారాం నాయక్ మండిపడ్డారు. లోక్‌సభలో హోంమంత్రి రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. బాధ్యత మర్చిపోయి వ్యవహరించిన ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన సెక్యులర్ పదం దుర్వినియోగమవుతోంని రాజ్‌నాథ్ గురువారం నాడు లోక్‌సభలో చేసిన ప్రసంగంపై ఆయన స్పందించారు. ఇలా రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తూ చట్టసభలో మాట్లాడడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని నాయక్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని హోంమంత్రి ఉల్లంఘించారని ఆరోపించారు. తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆయనను తొలగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తిచేశారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యల వల్లే దేశంలో అసహనం వ్యాప్తి చెందిందని నాయక్ మండిపడ్డారు. కాగా రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలన్న శివసేన డిమాండ్‌పై చర్చకు సిద్ధమని గతంలో ప్రకటించి ఎన్డీయే సర్కారు చిక్కుల్లో పడింది. ఆ పదాలు లేని పాత రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని ప్రచురించి ఓ ప్రకటన విడుదల చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ పదాలను తొలగించే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.