సర్జికల్ స్ట్రైక్స్ పై ‘ఆయన’కు నో ఐడియా
సాక్షి, పనాజీ: యూరీ దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి ముష్కరులను మట్టుపెట్టింది భారత సైన్యం. ఆ సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ నేతృత్వంలోనే ఈ మెరుపు దాడి జరిగిందన్న విషయం విదితమే. అయితే దీనిపై గొప్పలు చెప్పుకున్న పారికర్‌కు, సర్జికల్ స్ట్రైక్స్‌పై కనీస అవగాహన కూడా లేదంటోంది కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన గోవా ముఖ్యమంత్రిగా తిరిగి పగ్గాలు చేపట్టి, త్వరలో జరగబోయే పనాజీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీచేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు శాంతారామ్ నాయక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పారికర్‌పై మాటల తూటాలు పేల్చారు. ‘సర్జికల్ దాడుల గురించి పారికర్‌కు ఏం తెలీదు. జాతీయ భద్రతా విభాగం, ప్రధాని కార్యాలయ సిబ్బంది మాత్రమే అందులో పాల్గొన్నారు. తర్వాతే పారికర్‌కు ఆ విషయం తెలిసింది. అయినప్పటికీ ఆ గొప్పతనం అంతా తనది, మోదీది, వాళ్లను తీర్చిదిద్దిన ఆర్ఎస్ఎస్‌దంటూ పారికర్ చెప్పుకుని తిరిగాడు. ఇక్కడి రాజకీయాలకు భయపడే కేంద్రానికి వెళ్లాడు. అక్కడా రక్షణ మంత్రిగా విఫలం కావటంతో తిరిగి రాష్ట్రానికి పంపించేశారు. కానీ, అసలు ఆయన గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలకే పారికర్ అనర్హుడు’ అని నాయక్ పేర్కొన్నారు.
గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పారికర్ ఆగస్టు 23న జరగబోయే పనాజీ ఉప ఎన్నిక బరిలో దిగుతున్నారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి గిరీశ్ చోదంకర్, గోవా సురక్ష మోర్చా పార్టీ తరపున ఆనంద్ శిరోద్కర్ పోటీ చేస్తున్నారు.