
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుని, వైఫల్యాలను ప్రతిపక్షాలపై నెడుతూ అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నైజం అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 28న ప్రారంభం కానున్న మెట్రో రైలు నిర్మాణంలో టీఆర్‌ఎస్ పాత్ర ఏమీ లేదన్నారు. మెట్రో పనులకు కాంగ్రెస్ హయాంలోనే శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు.
మెట్రో రైలు నిర్మాణం ఆలస్యం కావడం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.3,500 కోట్ల అదనపు బారం పడిందన్నారు. మెట్రో రైలు 2, 3 దశలను ఎప్పుడు పూర్తి చేస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడో దశవల్ల పాతబస్తీ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పాతబస్తీకి మెట్రోను పొడిగించడానికి ఖర్చును కేంద్రం భరిస్తుందా లేక రాష్ట్రం భరిస్తుందా చెప్పాలని అన్నారు.
మెట్రో రైలు పాతబస్తీకి రావొద్దని, పాతబస్తీ అభివృద్ధి చెందకుండా ఉంటేనే తమకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందన్న కుట్రపూరిత ఉద్దేశంతో ఎంఐఎం ఆలోచిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగిందన్నారు. సన్ బర్న్ లాంటి పార్టీలకు అనుమతులు ఇచ్చి యువకులు, చిన్న పిల్లల జీవితాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ఇలాంటి పార్టీలకు అనుమతులు ఇవ్వొద్దని, ఈ పార్టీలకు అనుమతి ఇవ్వడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని తెలిపారు.