ముంబై : మహారాష్ట్ర రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా అవతరించిన శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో దేశ ఆర్థిక మందగమనానికి బీజేపీయే కారణమంటూ సంచలన కథనం ప్రచురించింది. కేంద్రం తీసుకున్న ఆర్థిక విధానాలపై సామ్నా సోమవారం నాటి ఎడిటోరియల్ సంచికలో విమర్శలు గుప్పించింది. ఫలితాలు వెలువడిన రోజు నుంచి ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీతో శివసేన విభేదిస్తున్న సంగతి తెలిసిందే.
దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి బీజేపీ విధానాలే కారణమని, దీనికి వారే బాధ్యత వహించాలంటూ పేర్కొంది. ప్రతి దీపావళి పండుగ నాడు కళకళలాడే దేశీయ మార్కెట్‌లు నేడు వెలవెలబోవడానికి కారణాలేంటో బీజేపీ తెలుసుకోవాలని సూచించారు. ఆదివారం రోజున శివసేన నాయకులు రిమోట్ తమ దగ్గర ఉందని, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నట్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన తర్వాత రోజే శివసేన అధికారిక పత్రికలో ఇలాంటి కథనం రాయడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నేత దివాకర్ రౌత్ సోమవారం వేర్వేరుగా గవర్నర్‌ను కలిశారు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని రెండు పార్టీలు చెప్పడం గమనార్హం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేనకు పూర్తి ఆధిక్యం వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య కొన్ని విభేదాలు నెలకొన్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చినట్లుగానే ముఖ్యమంత్రి పదవి, ప్రభుత్వ ఏర్పాటులో చెరిసగం వాటా ఉండాల్సిందేనని శివసేన గట్టిగా పట్టుబట్టింది. అయితే, బీజేపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేదు. మరోవైపు శివసేన ఉపముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని కొందరు బీజేపీ నేతలు సూచిస్తున్నారు. ఈ విభేదాల కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. తాజాగా శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో బీజేపీపై ఘాటు విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment