Saamna newspaper
-
స్వరం మార్చిన శివసేన!
ముంబై : మహారాష్ట్ర రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా అవతరించిన శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో దేశ ఆర్థిక మందగమనానికి బీజేపీయే కారణమంటూ సంచలన కథనం ప్రచురించింది. కేంద్రం తీసుకున్న ఆర్థిక విధానాలపై సామ్నా సోమవారం నాటి ఎడిటోరియల్ సంచికలో విమర్శలు గుప్పించింది. ఫలితాలు వెలువడిన రోజు నుంచి ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీతో శివసేన విభేదిస్తున్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి బీజేపీ విధానాలే కారణమని, దీనికి వారే బాధ్యత వహించాలంటూ పేర్కొంది. ప్రతి దీపావళి పండుగ నాడు కళకళలాడే దేశీయ మార్కెట్లు నేడు వెలవెలబోవడానికి కారణాలేంటో బీజేపీ తెలుసుకోవాలని సూచించారు. ఆదివారం రోజున శివసేన నాయకులు రిమోట్ తమ దగ్గర ఉందని, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నట్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన తర్వాత రోజే శివసేన అధికారిక పత్రికలో ఇలాంటి కథనం రాయడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నేత దివాకర్ రౌత్ సోమవారం వేర్వేరుగా గవర్నర్‌ను కలిశారు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని రెండు పార్టీలు చెప్పడం గమనార్హం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేనకు పూర్తి ఆధిక్యం వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య కొన్ని విభేదాలు నెలకొన్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చినట్లుగానే ముఖ్యమంత్రి పదవి, ప్రభుత్వ ఏర్పాటులో చెరిసగం వాటా ఉండాల్సిందేనని శివసేన గట్టిగా పట్టుబట్టింది. అయితే, బీజేపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేదు. మరోవైపు శివసేన ఉపముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని కొందరు బీజేపీ నేతలు సూచిస్తున్నారు. ఈ విభేదాల కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. తాజాగా శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో బీజేపీపై ఘాటు విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
స్వైన్‌ఫ్లూతో సీనియర్ పాత్రికేయుడి మృతి
సాక్షి, ముంబై: స్వైన్‌ఫ్లూ వ్యాధితో సీనియర్ పాత్రికేయుడు రమేశ్ రావుత్(52) శుక్రవారం మరణించారు. గత వారం రోజులుగా రావుత్ జ్వరంతో బాధపడుతుండటంతో డాక్టర్ హెడ్గేవార్ ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని పరీక్షలు నిర్వహించగా ఆయనకు స్వైన్‌ఫ్లూ సోకినట్టు గురువారం నిర్ధారణ అయింది. దీంతో ఆయనను ఔరంగబాద్‌లోని ఘాటి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన భార్య మాధురి కూడా జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను కూడా అదే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 20 ఏళ్లకుపైగా పాత్రికేయ వృత్తిలో.. రమేష్ రావుత్ గత 20 ఏళ్లకుపైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఔరంగాబాద్‌లోని అనేక దినపత్రికలలో ఆయన విధులు నిర్వహించారు. పాత్రికేయుడి నుంచి సంపాదకుడి వరకు అన్ని బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా ‘చిత్రలేఖ’ అనే వారపత్రికకు అనే క ఏళ్లు మరాఠ్వాడా ప్రతినిధిగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన రాసిన పలు ఆర్టికల్స్ చర్చల్లోకెక్కాయి. ముంబైలోని సామ్నా దినపత్రికలో కూడా విధులు నిర్వహించడంతో శివసేన, ఎమ్మెన్నెస్ అధ్యక్షులైన ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కుటుంబీకులతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఔరంగాబాద్‌తోపాటు మరాఠ్వాడాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన హఠాన్మరణంపై పాత్రికేయ మిత్రులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. -
రాజ్, ఉద్ధవ్ చెట్టాపట్టాల్..
సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలు ఒక్కటయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. శివసేన అధికార దినపత్రిక ‘సామ్నా’లో మంగళవారం ‘స్మృతిస్థలంలో ఒక్కటైన ఉద్దవ్ ఠాక్రే, రాజ్‌లు... ఇక వస్తాయి మంచి రోజులు...’ అనే శీర్షికతో ప్రధానవార్త ప్రచురితమైంది. దీంతో ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఒక్కటి కావాలని ఎమ్మెన్నెస్‌తోపాటు శివసేన నాయకులు కూడా కోరుకుంటున్నారని స్పష్టమైంది. ముఖ్యంగా వీరిద్దరు ఒక్కటికావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు వార్తలో పేర్కొన్నారు. అదే విధంగా చాలారోజుల తర్వాత సామ్నా పత్రికలో రాజ్ ఠాక్రే ఫొటోతోపాటు వార్త ప్రచురితంకాగా అదికూడా ఉద్ధవ్ ఠాక్రేతో కలిసిఉన్న ఫొటో కావడం విశేషం. ఇలాంటి నేపథ్యంలో రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఠాక్రే సోదరులిద్దరూ ఒక్కటవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.