సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న శివసేన.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీతో వైరుధ్యం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర పదవుల్లోని తమ నాయకుల చేత రాజీనామా చేపిస్తోంది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. ‘తామెందుకు ఇంకా ఢిల్లీలో ఉండాలి. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి.. మోదీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నా’ అంటూ సోమవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. దీంతో ముంబైతో పాటు ఢిల్లీ రాజకీయాలు సైతం ఒక్కసారిగా వేడెక్కాయి. అలాగే రాష్ట్రంలో సోమవారం భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వ ఏర్పాటులో తాము మద్దతు తెలపాలంటే శివసేన ఎన్డీయే కూటమి నుంచి పూర్తిగా బయటకు రావాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ షరతు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో పవార్ కండీషన్‌కు స్పందించిన శివసేన.. ఆదివారం అర్థరాత్రి వరకు పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, పలువురు సీనియర్లతో చర్చించారు. చివరికి వారి అంగీకారంతోనే పదవులకు రాజీనామా చేస్తున్నారు. అలాగే తాము ఎన్డీయే కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు త్వరలోనే శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రకటిస్తారని ముంబై వర్గాల సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత చూపింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ బీజేపీని శనివారం గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ వెనకడుగు వేయడంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. సీఎం పదవి విషయంలో శివసేనతో అంతరం పెరిగిపోవడం, ప్రభుత్వం ఏర్పాటుకు చాలినంత బలం కూడగట్టలేక బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకే మొగ్గు చూపింది. దీంతో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానం పంపారు. ఈ విషయంలో అభిప్రాయం తెలపాలంటూ సోమవారం సాయంత్రం 7.30 గంటల వరకు గవర్నర్ ఆ పార్టీ శాసనసభా నేత ఏక్‌నాథ్ షిండేకు గడువిచ్చారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్లో మకాం వేసిన శివసేన ఎమ్మెల్యేలంతా గవర్నర్ ఆహ్వానం అనంతరం పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి తరలివెళ్లారు.
కాంగ్రెస్ నిర్ణయంపై ఉత్కంఠ..
శివసేన–ఎన్సీపీ సంకీర్ణానికి కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జైపూర్‌లో ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యులు అంతిమ నిర్ణయాన్ని సోనియా గాంధీకి వదిలివేసేందుకు ఆమోదం తెలిపారు. ఎన్సీపీ చీఫ్ పవార్ మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం సోనియాతో సమావేశం కానున్నారు. ఆమెతో భేటీ అనంతరమే తమ నిర్ణయం తెలుపుతామని పవార్ ప్రకటించారు. దీంతో అందరీ కళ్లు కాంగ్రెస్ వైపు మళ్లాయి. అయితే, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక భాగస్వామ్య పక్షాలతో సాధారణంగా తలెత్తే విభేదాల కారణంగా తమ ఎమ్మెల్యేలు ప్రతిపక్షం వలలో పడే అవకాశముందని కర్ణాటక అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని కాంగ్రెస్ భయపడుతోంది. సంకీర్ణంలో భాగస్వామి అవుతుందా? లేక బయటి నుంచి మద్దతిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను ఎక్కడ బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందోననే భయంతో శివసేన కూడా క్యాంపు నడుపుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment