సిద్ధరామయ్య కుమారస్వామి
శివాజీనగర: ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య నోరుజారుతూ చిక్కుల్లో పడుతున్నారు. బీదర్‌లో గతవారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని వ్యాఖ్యానించి ఆ తరువాత నాలుక్కరుచుకున్న ఆయన మరోసారి నోరుజారారు. ముఖ్యమంత్రి కుమారస్వామిని మాజీ ముఖ్యమంత్రి అని సంబోధించి నాలుక్కరచుకున్నారు.
సోమవారం నగరంలోని హారోహళ్ళిలో సంకీర్ణ అభ్యర్థి కృష్ణభైరేగౌడ తరఫున ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ నేను ఇంకా అనేకచోట్ల ప్రచారాల్లో పాల్గొనాల్సి ఉంది, అందుచేత నేను తక్కువగా మాట్లాడుతాను, తరువాత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వస్తారని వ్యాఖ్యానించారు. వెంటనే ‘మాజీ కాదు, మాజీ కాదు’ అంటూ జనంలో నుంచి కొందరు కేకలు పెట్టారు. తప్పు గుర్తించిన సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామి వస్తారని తెలిపారు.
సిద్ధు ప్రసంగిస్తూ జేడీఎస్ అధినేత హెచ్.డీ.దేవేగౌడ బెంగళూరు ఉత్తర నుంచి పోటీ చేయాలని ఒత్తిడి ఉండేది. అయితే తుమకూరు ప్రజల కోరిక మేరకు అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా కృష్ణభైరేగౌడను ఎంపిక చేశామని చెప్పారు. కేంద్ర మంత్రి డీ.వీ.సదానందగౌడ నిష్క్రియాపరుడఉ, ఆయన మీకు ముఖం చూపించారా? ఆయనకు ముఖం చూపించే శక్తి లేదు అని విమర్శించారు. అందుచేత మోదీ ముఖం చూసి ఓటు వేయాలని చెబుతున్నారని అన్నారు. ఈలోగా సీఎం కుమారస్వామి ప్రచారానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment