మాజీ ప్రధాని దేవెగౌడ
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సీఎం సిద్దరామయ్యకు అర్థం కాలేదంటూ జనతాదళ్ (సెక్యూలర్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ మండిపడ్డారు. ఓ దక్షిణాది వ్యక్తి సీఎం అయ్యారని ప్రధాని ప్రశంసించారని, అంత మాత్రాన బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కన్నడ వ్యక్తి ప్రధాని కావడం దక్షిణాది వారికి ఎంతో గౌరవమంటూ దేవెగౌడను ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ప్రశంసించిన విషయం తెలిసిందే. వంశపారం పర్యంగా అధికారం కట్టబెట్టే యత్నం చేస్తూ తాను (దేవెగౌడ) రాజకీయాలను నాశనం చేస్తున్నారంటూ సిద్దరామయ్య విమర్శలు చేసి జాతీయ స్థాయిలో కన్నడిగుల పరువు, మర్యాదలు మంటకలిపారంటూ ధ్వజమెత్తారు. సిద్దరామయ్య కూమారుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన అంత తీవ్ర వ్యాఖ్యలు ఎలా చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ మాజీ ప్రధాని దేవెగౌడపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా కనిపిస్తోందని, దేవెగౌడను తాను గౌరవిస్తానని మంగళవారం ఓ ర్యాలీలో మోదీ తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక, కాంగ్రెస్‌పై మోదీ విమర్శలకు జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడనే కారణమని భావిస్తోన్న సీఎం సిద్దరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేయగా దుమారాం రేగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment