ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, బెంగళూరు: జనతాదళ్ సెక్యూలర్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ కాంగ్రెస్‌ను రక్షిస్తుందని, బీజేపీపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందని జేడీఎస్ నేతలను మోదీ విమర్శించారు. తమకూరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. గతంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తాను కర్ణాటకకు వచ్చినప్పుడు.. ‘మోదీ గెలిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను’ అంటూ మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయ అధ‍్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దేవెగౌడ, ఆయన పార్టీ జేడీఎస్ నేతల చర్యలు ఎప్పుడూ కాంగ్రెస్‌ను రక్షించేవిగా, బీజేపీని అడ్డుకునేవిగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దేవెగౌడపై తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని, ఆయన 100 ఏళ్లు ప్రజలకు సేవ చేసుకుంటూ జీవించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ను విజయం వరించదని ఎన్నికల సర్వేలు, రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్‌లు రహస్య ఒప్పందం చేసుకున్నాయని, ఆ మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాయని ఆరోపించారు. తెరవెనుక ఏం జరుగుతుందో కర్ణాటక ప్రజలకు తెలుసునని, ఈ ఎన్నికల్లో బీజేపీనే విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వారం రోజుల్లోనే మోదీ యూటర్న్..
ఇటీవల ఉడిపిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాజీ ప్రధాని దేవెగౌడపై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోదీ వారం రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నారు. కన్నడ వ్యక్తి ప్రధాని కావడం గర్వకారణమని, దేవెగౌడ ఆ ఘనత సాధించారని ఇటీవల కొనియాడారు. అంతలోనే పరిస్థితులు మారిపోయాయి. జేడీఎస్ లాంటి పార్టీకి మద్దతు తెలిపి మీ ఓటును వృథా చేసుకోవద్దంటూ కర్ణాటక ప్రజలకు తాజాగా మోదీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో పేదలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని.. మార్పు కోరుకుంటే బీజేపీకి ఓటువేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment