సిక్కింలో చిన్న పార్టీలే లక్కీ | Sikkim Constituency Review on Lok Sabha Election | Sakshi
Sakshi News home page

సిక్కింలో చిన్న పార్టీలే లక్కీ

Published Thu, Apr 4 2019 11:10 AM | Last Updated on Thu, Apr 4 2019 11:10 AM

Sikkim Constituency Review on Lok Sabha Election - Sakshi

దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలే ఎక్కువగా అధికారంలో ఉంటాయి. అప్పుడప్పుడు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా మొత్తం మీద చూస్తే జాతీయ పార్టీ ప్రభుత్వాలదే మెజారిటీ. సిక్కిం దీనికి పూర్తిగా మినహాయింపు. 1975లో ఈ రాష్ట్రం భారత్‌లో విలీనమైనప్పటి నుంచి ఇంత వరకు ఇక్కడ ఏ జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకున్నాయి. 1979, అక్టోబర్‌లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో నర్‌బహదూర్‌ భండారీ నాయకత్వంలోని సిక్కిం జనతా పరిషత్‌ (ఎస్‌జేపీ) 31 సీట్లకుగాను 16 సీట్లలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో రెండు ప్రాంతీయ పార్టీలు సిక్కిం కాంగ్రెస్‌ (రివల్యూషనరీ)11, సిక్కిం ప్రజాతంత్ర కాంగ్రెస్‌ 4 సీట్లు గెలుచుకున్నాయి. తర్వాత ఎస్‌జేపీ కాంగ్రెస్‌లో విలీనమైంది. కొంత కాలం తర్వాత భండారీ బయటకొచ్చేసి సిక్కిం సంగ్రామ్‌ పరిషత్‌ (ఎస్‌ఎస్‌పీ) పేరుతో ప్రాంతీయ పార్టీ పెట్టారు.

1985 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 30 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1989 ఎన్నికల్లో భండారీ పార్టీ మొత్తం 32 స్థానాలను గెలుచుకుంది. 1990లో ఎస్‌జేపీ నేత పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ భండారీపై తిరుగుబాటు చేశారు. సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) పేరుతో కొత్త పార్టీ పెట్టారు. 1994 ఎన్నికల్లో ఆ పార్టీ 19 సీట్లు గెలుచుకుని గద్దెనెక్కింది. 1999 ఎన్నికల్లో 24 సీట్లతో ఎస్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఎస్‌ఎస్‌పీ ప్రధాన ప్రతిపక్షమైంది. 2004, 2009, 2014 ఎన్నికల్లో కూడా చామ్లింగ్‌ పార్టీ ఘన విజయం సాధించి ఐదుసార్లు వరసగా అధికారం చేపట్టిన పార్టీగా రికార్డు సృష్టించింది. ఈసారి అసెంబ్లీకి, లోక్‌సభ(ఒకటే సీటు)కు కలిసి ఏప్రిల్‌ 11న ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలోని 371(ఎఫ్‌) అధికరణం సిక్కిం ప్రజల ప్రత్యేక హక్కుల పరిరక్షణకు హామీ ఇస్తోంది. తమ హక్కులను ప్రాంతీయ పార్టీలే పరిరక్షించగలవన్న గట్టి నమ్మకం ప్రజల్లో పాతుకుపోయిందని, జాతీయ పార్టీలను వేటినీ వారు నమ్మరని, అందుకే వారు జాతీయ పార్టీలను ఆదరించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement