సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్నవేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ ప్రవీణ్ వర్మ.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను టెర్రరిస్ట్‌తో పోలుస్తూ విమర్శించారు .దీనిపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ ప్రజలకు మెడిసిన్ అందిస్తున్నాను, మెరుగైన విద్యను అందిస్తున్నాను. నా కోసం కానీ నా కుటుంబం కోసం కానీ నేను ఏమీ చేయడం లేదు. ఢిల్లీ ప్రజల కోసం రాత్రీంబవళ్లు కష్ట పడుతున్నాను. ఇవన్నీ చేస్తున్న నేను ఉగ్రవాదిని ఎలా అవుతాను’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
‘నేను మధుమేహం రోగిని, ప్రతి రోజు నాలుగు సార్లు ఇన్సులిన్ తీసుకుంటాను. రాజకీయాల్లోకి వెళ్లొద్దని డాకర్లు సూచించారు. అయినప్పటికీ నేను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. నేను అనుకుంటే విదేశాల్లోకి వెళ్లి సుఖంగా బతకవచ్చు. విదేశాల్లో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. అయినా కూడా వెళ్లలేదు. కావాలనుకుంటే నా ఉద్యోగంలో తిరిగి చేరి సంతోషంగా ఉండవచ్చు. కానీ నేను ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాను. ఒక ఉగ్రవాది ఇన్ని త్యాగాలు చేయగలడా? నేను ఉగ్రవాదినో లేదా వారి బిడ్డనో ఢిల్లీ ప్రజలే నిర్ణయిస్తారు’ అంటూ కేజ్రీవాల్ భాగోధ్వేగానికి లోనయ్యారు.
కాగా, ఇటీవల ఓ ఎన్నికల ర్యాలీలో ఎంపీ ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ లాంటి వ్యక్తి మరోసారి అధికారంలోకి వస్తే ఢిల్లీలో అరాచకాలు జరుగుతాయని, కశ్మీర్‌లో మాదిరి ఢిల్లీలో కూడా హిందూవులపై దాడులు జరుగుతాయని హెచ్చరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడం చేయాలా లేదా ఢిల్లీలోని కేజ్రీవాల్ లాంటి ఉగ్రవాదులతో పోరాటం చేద్దామా అని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రవీణ్ వర్మ వ్యాఖ్యలపై ఆప్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఉగ్రవాదితో పోల్చిన ప్రవీణ్ వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment