
సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ ఘనవిజయం సాధించడంతో జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఎదుర్కొనేందుకు ఒక కూటమిగా జట్టు కట్టాలని భావిస్తున్నాయి. యూపీ, బిహార్ ఉప ఎన్నికల విజయాలు.. ఈ మేరకు మహాకూటమి ఏర్పాటు ప్రయత్నాలకు బలమైన ఊతం ఇస్తున్నాయని తాజాగా ఎన్సీపీ ఎంపీ మజీద్ మెమమ్ తెలిపారు. ప్రతిపక్షాల మహాకూటమి ఏర్పాటుకోసం ఇప్పటికే సోనియాగాంధీ, శరద్ పవార్ కలిసి పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు.
గోరఖ్‌పూర్, ఫుల్ఫూర్ ఉప ఎన్నిల్లో బీజేపీ ఓడిపోయిన కాసేపటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న ఢిల్లీలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ కాబోతున్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకే రాహుల్ ఈ భేటీలు చేపడుతున్నట్టు భావిస్తున్నారు. అటు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడా మహాకూటమి ఏర్పాటు సాధ్యమేనని అంచనా వేశారు.
ప్రతిపక్ష కూటమి సత్తా ఏమిటో యూపీ ఉప ఎన్నికల ఫలితాల్లో వెల్లడైందంటూ.. ఎస్పీ, బీఎస్పీ పొత్తును ఆయన ఉటంకించారు. ఆయన తనయుడు, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా కొన్నిరోజుల కిందట ఢిల్లీలో యూపీఏ చీఫ్ సోనియాగాంధీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సోనియా ఈ విందు ఇచ్చినట్టు భావించిన సంగతి తెలిసిందే. సోనియా ఇచ్చిన విందుకు హాజరైన సీపీఐ నేత డీ రాజా కూడా బీజేపీ వ్యతిరేక భావసారూప్య పార్టీల కూటమి ఏర్పాటు సాధ్యమేనంటూ పేర్కొన్నారు. అయితే, యూపీలో విజయాలతో జోరుమీదున్న ఎస్పీ మాత్రం ప్రతిపక్ష మహాకూటమిపై వేచి చూసే ధోరణి కనబరుస్తోంది. 2019 ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటుకు అవకాశముందా? అని ప్రశ్నించగా.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సన్నిహితుదు రాంగోపాల్ యాదవ్.. ఏర్పాటు కావొచ్చేమో.. వేచిచూడండంటూ బదులిచ్చారు.