సోనియా విదేశీ మూలాలే కాదు.. అంతకుమించి!
మరాఠా రాజకీయ యోధుడు శరద్‌పవార్ కాంగ్రెస్ పార్టీని వీడి.. సొంత పార్టీ ఎన్సీపీని స్థాపించడానికి కారణాలేమిటి? ఆయన చెప్పినట్టు సోనియాగాంధీ విదేశీ మూలాలే ఇందుకు కారణమా? ఇంకా బలమైన కారణాలు కూడా ఉన్నాయా? అంటే శరద్‌పవర్ తాజా ఆత్మకథ ఔననే అంటోంది. సోనియా విదేశీ మూలాలే కాదు.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పదవిని తనకు నిరాకరించడం, తన నిర్ణయాలను సోనియా లెక్కచెయకపోవడం అందుకు కారణమని ఆయన ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. తన 75వ జన్మదినం సందర్భంగా 'ఆన్ మై టెర్మ్స్- ఫ్రం ద గ్రాస్‌రూట్స్ టు ద కారిడార్స్ ఆఫ్ పవర్' పేరిట శరద్‌పవర్ రాసిన ఆత్మకథ విడుదలైంది.
'కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ)ని సోనియాకు అనుగుణంగా మారుస్తూ పార్టీ రాజ్యాంగంలో దిగ్భ్రాంతికర సవరణ తీసుకొచ్చారు. దీనిద్వారా సీపీపీ లీడర్ పదవిని చేపట్టేందుకు ఎంపీ అయి ఉండాలన్న నిబంధనను పక్కనబెట్టారు. ఈ నిర్ణయం నన్ను తీవ్రంగా బాధించింది. ఈ దురదృష్టకర పరిణామంతో సోనియాగాంధీకి నాకు మధ్య భారీ అగాథం ఏర్పడింది. లోక్‌సభలో చాలావరకు నా నిర్ణయాలను సోనియా పక్కనబెట్టడం పరిస్థితిని మరింతగా దిగజార్చింది. నేను, ఆమె కలిసి ఏదైనా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొంటే.. దానికి పూర్తి విరుద్ధంగా ఆమె వ్యవహరించేది. ఈ పరిస్థితి దాదాపు ఏడాదిపాటు ఇదేవిధంగా కొనసాగి..చివరకు బద్దలైంది' అని శరద్‌పవార్ ఈ పుస్తకంలో తెలిపారు.
1999 ఏప్రిల్ 17న వాజపేయి ప్రభుత్వం పడిపోవడం, ఏప్రిల్ 21న ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తూ సోనియాగాంధీ అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌ను కలువడం వంటి రాజకీయ పరిణామాల గురించి ఆయన తన పుస్తకంలో వివరించారు. సోనియాగాంధీ తమకు 272మంది ఎంపీల మద్దతు ఉన్నదని ప్రకటించారు. అయితే చివరినిమిషంలో ములాయంసింగ్ కాంగ్రెస్‌కు మద్దతు నిరాకరించడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నం విఫలమైంది. 'లోక్‌సభలో నేను పార్టీ నాయకుడిగా ఉన్నా.. రాష్ట్రపతి వద్దకు వెళ్లేముందు నన్ను సంప్రదించాలని సోనియా భావించలేదు' అని శరద్‌పవర్ వివరించారు.