అఖిలపక్ష సమావేశంలో ‘ప్రత్యేక హోదా’ ప్రస్తావన | Special Category Status Mentioned By AP CM YS jagan Mohan Reddy In All Party Meeting | Sakshi
Sakshi News home page

అఖిలపక్ష సమావేశంలో ‘ప్రత్యేక హోదా’ ప్రస్తావన

Published Wed, Jun 19 2019 10:18 PM | Last Updated on Wed, Jun 19 2019 10:20 PM

Special Category Status Mentioned By AP CM YS jagan Mohan Reddy In All Party Meeting - Sakshi

ఢిల్లీ: అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి గళమెత్తారు. పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఐదేళ్లయినా ఇంకా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే ఆ వ్యవస్థలపై ప్రజలకు ఎలా నమ్మకం ఉంటుందని ప్రశ్నించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలు నిర్ణీత కాలవ్యవధితో నెరవేరిస్తే సభలో పార్టీల నిరసన ఆగిపోతుందని సూచించారు. రాజీనామా చేయకుండా ఎంపీ, ఎమ్మెల్యేలను రాజకీయ పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ఆ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని కోరారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను టీడీపీలోకి చేర్చుకున్న విషయాన్ని వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా వారిపై అనర్హత వేటు వేయకుండా చట్టాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు.

10వ షెడ్యూల్‌ సవరించండి
ఫిరాయింపులకు పాల్పడ్డ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 90 రోజుల్లో అనర్హత వేటు వేసేలా 10వ షెడ్యూల్‌ సవరించాలని కోరారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు తాము సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నట్లు చెప్పారు. పదే పదే ఎన్నికల వల్ల అభివృద్ధి ప్రక్రియకు విఘాతం కలుగుతుందని వివరించారు. ప్రజాధనం వృధా, అధికార దుర్వినియోగం కూడా తగ్గుతుందని అన్నారు. ఏకకాల ఎన్నికలకు సంబంధించి సాంకేతిక అంశాలను అధిగమించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ప్రధాన మంత్రి ఏర్పాటు చేస్తారనే నమ్మకం తనకుందన్నారు. వైద్య విద్యా రంగంపై కేంద్ర ప్రభుత్వం అధికంగా ఖర్చు చేయాలని విన్నవించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. వైద్య ఖర్చుల కోసం ప్రజలు తమ జేబు నుంచి అధికంగా ఖర్చు పెడుతున్నారని, దీన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్రిక్స్‌దేశాలతో సమానస్థాయిలో భారత దేశాన్ని వైద్యవిద్యారంగంలో నిలబెట్టాలని అభిలషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement