
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను చూసి తాము గర్వపడుతున్నామని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...టీడీపీ గతంలో తమ అంశాలను పట్టించుకోకుండా కేవలం వాళ్ల ఎజెండాలనే పరిగణలోకి తీసుకొని బీఏసీ సమావేశం నిర్వహించేదని తెలిపారు. ఈసారి గతానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. శాసనసభ చరిత్రను తిరగరాసే బిల్లులను ప్రవేశపెట్టబోతున్నామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ప్రతిపక్ష పార్టీ అడిగే ప్రతీ విషయంపై చర్చించడానికి అవసరమయితే అసెంబ్లీ పని దినాలు పెంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం బీఏసీ సమావేశంలో ఏడుగురికి మించి ఉండరాదని, టీడీపీకి ఉన్నసంఖ్యాబలం ప్రకారం సమావేశంలో ఒక్కరికే పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరు కాకపోవడం దురదృష్టకరమని, దీన్ని బట్టే ఆయనకు ప్రజా సమస్యలపై ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment