
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏ సీఎం అయినా తన చెప్పుచేతల్లోనే ఉంటారని చాంద్రాయణగుట్ట ఎం ఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ వివాదస్పద వ్యాఖ్య లు చేశారు. అక్బరుద్దీన్ శుక్రవారం రాత్రి పాతబస్తీలోని రియాసత్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభ సందర్భంగా మాజీ సీఎంలపై వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. మజ్లిస్ పార్టీ రాబోయే ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ అని అభివర్ణించుకున్నారు. ఏ పార్టీ సీఎం అయినా తమ ముందు వంగి సలాం కొట్టినవారేనని ఆరోపించారు. దివంగత సీఎం వైఎ స్సార్, ఏపీ సీఎం చంద్రబాబు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు, ప్రస్తుతం కేసీఆర్ అందరూ తమ మాటలను విన్నారనీ కాదు.. వినాల్సిందే అని అన్నారు.
అందరినీ బ్యాలెన్స్ చేసే శక్తి తమ వద్ద ఉంద నీ, అది తమకు బాగా తెలుసన్నా రు. తాను కింగ్ మేకర్‌ననీ, ఎవరిని సింహాసనంపై కూర్చోబెట్టాలో ఎవరిని దించాలో తెలుసనీ ఆ సత్తా తమకు ఉందన్నారు. రాబోయే ప్రభుత్వం తమ ద్వారానే అధికారంలోకి వస్తుందని, డిసెంబర్ 11 ఎన్నికల తరువాత సీఎంను నిర్ణయించే క్రమంలో తమ పార్టీ కీలకంగా మారనుందన్నారు. రాజకీయం పిల్లల ఆట కాదనీ, అది నేర్చుకోవడానికి సమయం పడుతుందన్నారు. పాతబస్తీలో తమకు ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం హిందువు, హిందూత్వం, హైందవ రాజ్యం దానిపైనే దృష్టి కేంద్రీకరించారని.. కానీ మజ్లిస్ పార్టీ మొత్తం భారతదేశాన్ని పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీల పేరు వాడుకొని రాజకీయ పబ్బం గడుపుతోందని విమర్శించారు.
అక్బర్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ మైనార్టీ నేతల ఆగ్రహం..
గతంలో కూడా అసదుద్దీన్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. కారు ఇటు రావద్దని, ఆ స్టీరింగ్ తన చేతిలో ఉందని ఎటు తిప్పాలో అటు తిప్పుతామని విమర్శించారు. తాజాగా ఎన్నికల ప్రచార సభలో అక్బర్ కాంగ్రెస్, టీడీపీలతోపాటు మిత్రపక్షమైన టీఆర్‌ఎస్ పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌కి చెందిన మైనార్టీ నేతలతో పాటు ఇతర నేతలు మజ్లిస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అసెంబ్లీ ‘సాక్షి’గా అక్బరుద్దీన్ కేసీఆర్‌ను ముస్లింల ఆపద్బాంధవునిగా అభివర్ణించారని గుర్తు చేస్తున్నారు.