తప్పు చేస్తే అంగీకరించాలి  | Supreme Court gives govt 4 days to file Rafale affidavit | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తే అంగీకరించాలి 

Published Wed, May 1 2019 1:57 AM | Last Updated on Wed, May 1 2019 1:57 AM

Supreme Court gives govt 4 days to file Rafale affidavit - Sakshi

న్యూఢిల్లీ: రఫేల్‌ కేసులో తీర్పుకు చౌకీదార్‌ చోర్‌ హై వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించిన కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన తాజా అఫడవిట్‌పై సుప్రీంకోర్టు మంగళవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాహుల్‌ నేరుగా తన తప్పును అంగీకరించకపోవడాన్ని తప్పు పట్టింది. తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించాలని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘మా ఉత్తర్వులో ఎక్కడ మేం అలా చెప్పాం. ఇలాంటి ప్రకటనలన్నీ మీరు మాకెలా ఆపాదిస్తారు..?’ అని బెంచ్‌ నిలదీసింది. ఒక పక్క తప్పును అంగీకరిస్తున్న రాహుల్‌ మరోపక్క వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నట్టుగా పేర్కొంటున్నారని వ్యాఖ్యానించింది.

అఫిడవిట్‌లో విచారం (రిగ్రెట్‌) అన్న పదాన్ని బ్రాకెట్‌లో పెట్టడంలోని అర్థం ఏమిటి? అని ధర్మాసనం రాహుల్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీని ప్రశ్నించింది. ఈ అఫిడవిట్‌ ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారో  తమకు అర్ధం కావడం లేదని న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విచారం (రిగ్రెట్‌), క్షమాపణ (అపాలజీకి) రెండూ ఒకటే అన్నట్టుగా నిఘంటువులో ఉందని సింఘ్వీ చెప్పారు. రాహుల్‌ నిజాయితీగానే కోర్టును క్షమాపణ కోరుతున్నారని తెలిపేలా మరో మెరుగైన అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు వచ్చే సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోరగా.. ధర్మాసనం అందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది. 

నాలుగు వారాలు కుదరదు
రఫేల్‌ ఒప్పందంపై తాము ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మే నాలుగో తేదీలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం కోరినట్టుగా నాలుగు వారాల గడువు ఇచ్చేందుకు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం నిరాకరించింది. న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్‌ తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది.

ఫ్రాన్స్‌ నుంచి 36 ఫైటర్‌ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ గత డిసెంబర్‌ 14న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రూ.58 వేల కోట్ల ఒప్పందంలో అవకతవకల ఆరోపణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ తీర్పుపై కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌ శౌరీ, యశ్వంత్‌ సిన్హాలతో పాటు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తదితరులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్‌ 10న ఈ పిటిషన్లను ఆమోదించిన సుప్రీంకోర్టు కౌంటర్‌ దాఖలుకు కేంద్రాన్ని ఆదేశించింది.

రాహుల్‌కు కేంద్రం నోటీసులు
రాహుల్‌ పౌరసత్వం వ్యవహారంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి గతంలో చేసిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ హోం శాఖ రాహుల్‌కు తాజాగా నోటీసులు జారీ చేసింది. పక్షం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంది. దీనిపై రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ అమేథీలో స్పందించారు.‘ఈ ఆరోపణలన్నీ అర్థం లేనివి. రాహుల్‌ ఇక్కడే పుట్టారు. ఇక్కడే ఉన్నారు. ఇక్కడే పెరిగారు. ఆయన భారతీయుడన్న విషయం దేశానికంతటికీ తెలుసు’ అని అన్నారు. కాగా, రాహుల్‌ పౌరసత్వంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ 2015లో దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement