న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందే నిధులపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందిన మొత్తం, దాతల బ్యాంకు అకౌంట్ల వివరాలను ఎన్నికల సంఘాని(ఈసీ)కి అందజేయాలని రాజకీయ పార్టీలను కోరింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత సాధించేందుకు ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలి లేదా బాండ్లను కొనుగోలు చేసే దాతల వివరాలను బహిర్గతం చేయాలంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఎదుట గురువారం వాదనలు పూర్తయ్యాయి.
శుక్రవారం ధర్మాసనం ఇందుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతానికి బాండ్ల జారీ ప్రక్రియలో జోక్యం చేసుకోబోమన్న బెంచ్.. బాండ్ల జారీ విధానానికి అనుగుణంగా ఐటీ, ఎలక్టోరల్, బ్యాంకింగ్ చట్టాల్లో కేంద్రం తీసుకువచ్చిన మార్పులతోపాటు అవి రాజకీయ పార్టీలన్నిటికీ సమానంగా వర్తిస్తున్నాయా లేక ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా ఉన్నాయా అనేది సమీక్షిస్తామంది. బాండ్ల ద్వారా అందిన మొత్తం, దాతల బ్యాంకు అకౌంట్ల వివరాలను సీల్డు కవర్‌లో మే 30లోగా ఈసీకి అందజేయాలని పార్టీలను కోరింది.
ఏప్రిల్– మేలో జారీ చేసే బాండ్ల గడువును 5 రోజులకు కుదించాలని ఆర్థిక శాఖకు సూచించింది. ఏడీఆర్ పిటిషన్‌పై తుది తీర్పు వెలువరించే తేదీని ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రకటిస్తామని స్పష్టతనిచ్చింది. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత పెంచే లక్ష్యంతో జారీ చేస్తున్న ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేదెవరో తెలియనప్పుడు ఎన్నికల్లో నల్లధనాన్ని కట్టడి చేయడం ఎలా సాధ్యమని గురువారం విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి ఈ విధానంలో జోక్యం చేసుకోరాదని, ఎన్నికలు ముగిసిన తర్వాతే ఇది ఎలా పనిచేస్తుందో పరిశీలించాలని కేంద్రం చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది.
స్వాగతించిన కాంగ్రెస్
సుప్రీంకోర్టు ఉత్తర్వులను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. రాజకీయ పార్టీలకు అందే నిధులు, వాటి నిర్వహణ విషయంలో పారదర్శకత పాటించాలని తాము ఎప్పటినుంచో కోరుతున్నామని పార్టీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. సుప్రీం తాజా ఉత్తర్వుల ఫలితంగా కాషాయ పార్టీ– సూటుబూటు స్నేహితులకు మధ్య ఉన్న బంధం బయటపడనుందని ఆమె వ్యాఖ్యానించారు.
బీజేపీ వాదన వీగిపోయింది: సీపీఎం
బాండ్ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న వాదనలో పసలేదని సుప్రీంకోర్టు తేల్చిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ‘పార్టీలకు నల్లధనాన్ని విరాళంగా ఇవ్వాలనుకునే దాతలు వెనుకంజ వేస్తారు. అటువంటి దాతలు ఎవరనే విషయం ఇకపై ప్రజలకు సైతం తెలుస్తుంది’ అని అన్నారు.
తుది తీర్పు కోసం చూస్తాం: బీజేపీ
ఎలక్టోరల్ బాండ్ల జారీపై సుప్రీంకోర్టు తుది తీర్పుకోసం ఎదురుచూస్తున్నట్లు బీజేపీ పేర్కొంది. ఇప్పటికే తమ అభిప్రాయాన్ని న్యాయస్థానం ముందుంచినట్లు తెలిపింది. ఆ పార్టీ ప్రతినిధి, లాయర్ నళిన్ కోహ్లి స్పందిస్తూ..‘సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఎలాంటిదైనా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కోర్టుకు తెలిపింది. దీనిపై తుది తీర్పు కోసం వేచి చూస్తాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment