
సాక్షి, అమరావతి: బీజేపీ సర్కారు ఓటమి కోసం మహాసంకీర్ణాన్ని ఏర్పాటు చేస్తామని సీపీఐ ప్రకటించింది. మోదీ ప్రభుత్వాన్ని చెత్తబుట్ట లోకి నెట్టేయాల్సిన సమయం వచ్చిందని మండిపడింది. లాల్– నీల్ (కమ్యూనిస్టులు– దళితులు) కలసి ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను పారదోలాలని పిలుపినిచ్చింది. బీజేపీ పాలనను తుదముట్టించేందుకు కాంగ్రెస్ సహా అన్ని వర్గాల ప్రజలు, ప్రాంతీయ పార్టీలతో మహాసంకీర్ణాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో నిర్ణయించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రకటించారు.
అంతా ఏకతాటిపైకి రావాలని పిలుపు
విజయవాడలో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా బుధవారం జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ ఏపీ కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షతన జరిగిన సభలో సురవరం సుధాకర్‌రెడ్డి ప్రసంగిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించేందుకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు, మేధావులు, విద్యార్థులు అంతా ఏకతాటిపైకి రావాలన్నారు. మోదీ అధికారాన్ని చేపట్టాక ముస్లిం మైనారిటీలు, దళితులు, మేధావులు, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని సురవరం అన్నారు. బీజేపీ పాలన అబద్ధాలు, తప్పుడు ప్రచారంతో సాగుతోందన్నారు.
అభివృద్ధి ఎక్కడ బాబూ: కె.రామకృష్ణ
చంద్రబాబు చెబుతున్న అభివృద్ధి ఎక్కడో చూపించాలని పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సవాల్ చేశారు. రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం పెరిగిందే కానీ అభివృద్ధి చుక్కానీకి కూడా కనిపించడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కె.నారాయణ, అతుల్ కుమార్ అంజన్ తదితరులు పాల్గొన్నారు.
మోదీ ఆసక్తి చూపట్లేదు: డి. రాజా
పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇవ్వని బీజేపీతో చంద్రబాబుకు దోస్తీ ఎందుకని సీపీఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.రాజా ప్రశ్నించారు. చంద్రబాబును కలిసేందుకు కూడా మోదీ ఆసక్తి చూపడం లేదని ఎద్దేవా చేశారు. భావసారూప్యం కలిగిన ప్రాంతీయ పార్టీలతో కలసి పనిచేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment