రాహుల్‌గాంధీతో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, డీకే అరుణ, బండ కార్తీకరెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ‘‘తెలంగాణలో పార్టీ బలంగా ఉంది. కానీ, నేతల మధ్య సమన్వయం లేదు. భేదాభిప్రాయాలతో కొంత నష్టం జరుగుతోంది. మీరు చొరవ తీసుకుని సమన్వయం కుదర్చాలి. అందుకు తగిన సమయం కేటాయించాలి..’’ అని కోరారు. పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర పార్టీ సీనియర్లందరితో చర్చించి తగిన కార్యాచరణ రూపొం దించాలన్నారు. బుధవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారమే రాహుల్ పుట్టినరోజు అయినా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో బుధవారం కలిశారు.
ఈ బృందంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, శ్రీధర్‌బాబు, గండ్ర వెంకట రమణారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, బండ కార్తీకరెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ బృందం విజ్ఞప్తి పట్ల రాహుల్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సమయం ఇస్తానని హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఒకట్రెండు నిమిషాలపాటు విడిగా రాహుల్‌తో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ‘‘తెలంగాణలో పార్టీ వేగం తగ్గింది. సీనియర్ నేతలందరితో విడివిడిగా చర్చించి కార్యాచరణ రూపొందించాలి. నాయకత్వంపై దృష్టిపెట్టాలి..’ అని విన్నవించగా.. మళ్లీ ఓసారి సమావేశమై లోతుగా చర్చిద్దామని రాహుల్ పేర్కొన్నట్టు తెలిసింది.
సీనియర్ నేతలతోనూ భేటీ..
రాహుల్‌ను కలసిన అనంతరం కోమటిరెడ్డి వెంకటరె డ్డి సోదరులు, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి తదితరులు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్‌తో భేటీ అయ్యారు. ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదని, పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కుంతియాతో మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు విడివిడిగా మంతనాలు జరిపారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని, మార్పులు చేపట్టాలని వారు పేర్కొన్నట్టు తెలుస్తోంది. పార్టీ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాతోనూ పలువురు నేతలు సమావేశమయ్యారు.
మూకుమ్మడిగా పాదయాత్ర..
తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం పాదయాత్ర చేయాలని పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దల వద్ద ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు పార్టీలోని నేతలంతా మూకుమ్మడిగా పాదయాత్ర చేయాలనే అభిప్రాయం వ్యక్తమైందని తెలిసింది. దీనికి పార్టీ పెద్దల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఫిర్యాదులు చేశారన్న వార్తలు అవాస్తవం: కుంతియా
రాహుల్ గాంధీకి పలువురు టీ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేశారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా చెప్పారు. బుధవారం సాయంత్రం ఆయన ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర నాయకత్వంపై నేతలు రాహుల్‌కు ఫిర్యాదు చేసినట్టు కొన్ని టీవీల్లో వచ్చింది. ఎవరూ ఎవరికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదు. అది కేవలం ఉత్త ప్రచారమే. నేను అక్కడే ఉన్నా.. నేతలంతా రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే వచ్చారు.
నిన్న (మంగళవారం) సమయం దొరకకపోవడంతో బుధవారం కలిశారు. పలు ఇతర రాష్ట్రాల నేతలు కూడా కలసి శుభాకాంక్షలు చెప్పారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రెండు రోజుల ముందే ఢిల్లీకి వచ్చి రాహుల్‌ను కలిసి వెళ్లారు. అంతేతప్ప ఈరోజు ఎవరూ ఎవరిమీద ఫిర్యాదు చేయలేదు..’’అని తెలిపారు. ఉత్తమ్ టీపీసీసీ చీఫ్‌గా ఉంటే 15 సీట్లు కూడా గెలవలేమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారంటూ వచ్చిన వార్తలను ప్రస్తావించగా.. ‘‘ఆ విషయంపై నాకు సమాచారం లేదు. రాహుల్ వద్ద ఎలాంటి సంప్రదింపులు జరగలేదు..’’అని కుంతియా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment