
సాక్షి, న్యూఢిల్లీ : ఎర్రకోటను కూడా దేశ ద్రోహులే నిర్మించారని, మరి ఆ కోటపై జెండా ఎగురవేయకుండా ప్రధాని నరేంద్రమోదీ ఉంటారా అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. తాజ్ మహల్‌పై బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సూటి ప్రశ్నలు వేశారు. తాజ్ మహల్‌ను చూడొద్దని పర్యాటకులకు మోదీ, యోగి చెప్పగలరా అని ప్రశ్నించారు.
వివాదం నుంచి పక్కకు జరిగిన యోగి ప్రభుత్వం
తాజ్‌మహల్‌పై తమ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యల నుంచి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కకు జరిగింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేస్తూ ప్రభుత్వం తరుపున రీతా బహుగుణ జోషి ప్రకటన చేశారు. తమ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమ ప్రభుత్వం తాజ్ మహల్ వారసత్వ కట్టడాల్లో ఒకటని ఎప్పుడో ప్రకటించామని తెలిపారు. ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రముఖ చారిత్రక వారసత్వ కట్టడం తాజ్ మహల్ అని, ఆగ్రా, తాజ్ మహల్ అభివృద్ధికోసం తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఒక పర్యాటకులపరంగా చెబితే తాజ్ మహల్‌ను చూసి గర్విస్తున్నామని తెలిపారు. తాజ్‌మహల్ భారతీయ సంస్కృతిపై ఓ మాయని మచ్చ అని సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.