చరిత్ర తెలియని చరిత్ర హీనుడు చంద్రబాబు | Tammineni Seetharam Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చరిత్ర తెలియని చరిత్ర హీనుడు చంద్రబాబు

Published Sun, Feb 17 2019 3:17 PM | Last Updated on Thu, Jul 11 2019 9:04 PM

Tammineni Seetharam Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, ఏలూరు: బీసీల గురించి, బీసీల చరిత్ర గురించి తెలియని చరిత్రహీనుడు చంద్రబాబునాయుడు అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. రామాయణ, భారత, భాగవత పురాణాల్లో బీసీలకు గొప్ప చరిత్ర ఉందని, అలాంటి బీసీలను నోటికొచ్చినట్టు మాట్లాడే చంద్రబాబు లాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని అన్నారు. ఏలూరులో ఆదివారం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’  భారీ సభలో తమ్మినేని సీతారాం మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ చంద్రబాబును కలిసేందుకు నాయి బ్రాహ్మణులు వెళితే.. వారి తోకలను కత్తిరిస్తానని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని, నాయి బ్రాహ్మణుల చేతిలో కత్తెర ఉంటుందని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు గుండుకొట్టి పంపిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తమను ఎస్టీల్లో చేర్చాల్సిందిగా కోరుతూ ఆందోళన చేసిన మత్స్యకారులను తాట తీస్తామని చంద్రబాబు హెచ్చరించారని, మత్స్యకారులు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని, టీడీపీని పసిఫిక్‌ సముద్రంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

యాదవ, కురవా, బోయల సామాజిక వర్గాలను సైతం చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మళ్లిస్తున్నారని, ఆగస్టు నెలనాటికి పోస్టు డేటెడ్‌ చెక్కులు ఇచ్చి మహిళలను మభ్యపెడుతున్నారని, ఆగస్టు నాటికి చంద్రబాబు ప్రభుత్వం ఫసిపిక్‌ మహా సముద్రంలో కలిసిపోతుందని అన్నారు. జనాభా ప్రాతిపదికగా బీసీలందరికీ న్యాయం చేసేందుకు, వారి సంక్షేమానికి పాటుపడేందుకు, బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు వైఎస్‌ జగన్‌ గొప్ప బీసీ డిక్లరేషన్‌ సభలో ప్రకటించబోతున్నారని తెలిపారు.

బీసీలు వంచనకు గురయ్యారు..

బీసీ సామాజికవర్గాలకు గత ఎన్నికల్లో కులాల వారీగా హామీలిస్తూ.. చంద్రబాబునాయుడు అన్ని వర్గాలను మోసం చేశారని, టీడీపీ పాలనలో బీసీలు వంచనకు గురయ్యారని వైఎస్సార్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ విమర్శించారు.  ఏలూరులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’  భారీ సభలో మోపిదేవి మాట్లాడుతూ.. బీసీలకు పటిష్టమైన భద్రత కల్పించడానికి బీసీల సామాజిక పరిస్థితులపై వైఎస్‌ జగన్‌ క్షుణ్నంగా అధ్యయనం చేసి.. తెలుసుకున్నారని, బీసీల వర్గాలందరికీ జీవన భద్రత కల్పించేందుకు, వారిని అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఒక భరోసాను వైఎస్‌ జగన్‌ సభలో ఇవ్వబోతున్నారని మోపిదేవి తెలిపారు. చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఒక్కో సామాజిక వర్గ బలహీనతలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా వైఎస్సార్‌సీపీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు అండగా ఉంటూ.. మోసం చేసిన తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నేత మేకా శేషుబాబు మాట్లాడుతూ.. బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే సభలు పెట్టి చంద్రబాబు హడావుడి చేస్తున్నారని విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement