సాక్షి, అమరావతి: శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సభాపతి తమ్మినేని సీతారాం.. ‘తాను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినే కానీ బలహీనుడ్ని మాత్రం కాదు’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని విపక్ష సభ్యులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఏకంగా పోడియం పైకి వెళ్లి పదేపదే స్పీకర్‌ను చుట్టుముట్టడం, సభాపతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు ముఖ్యమంత్రి, మంత్రులను ఏకవచనంతో నోటికొచ్చినట్టు మాట్లాడడంపై సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిపై కఠినంగా వ్యహరించాలని కోరారు. సభ్యుల వినతిపై స్పీకర్ తమ్మినేని స్పందిస్తూ సభానాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినైన తనకు స్పీకర్‌గా అవకాశం ఇచ్చారని చెప్పారు. నేను బలహీనుడినో, బలవంతుడినో ప్రతిపక్ష నాయకుడికి కూడా అనుభవం ఉందని తమ్మినేని వ్యాఖ్యానించారు. బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలు శక్తిహీనులు కాదని రుజువు చేసే బ్రహ్మాండమైన అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చారన్నారు.
ఎథిక్స్ కమిటీకి విపక్ష సభ్యుల తీరు
ఈరోజు (బుధవారం) శాసనసభలో జరిగిన ఉదంతం చాలా దురదృష్టకరమని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. నిబంధనలు, కన్వెన్షన్స్ నియమాలను ఉల్లంఘించి గత మూడు రోజులుగా సభ జరుగుతున్న తీరు ఆక్షేపణీయమన్నారు. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేల అనుచిత వ్యవహారాన్ని ఎథిక్స్ (నైతిక విలువల) కమిటీకి నివేదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని అంబటి రాంబాబు చైర్మన్‌గా ఉన్న ఎథిక్స్ కమిటీకి సూచించారు. తర్వాత దీనిపై ఏ చర్యలు చేపట్టాలో నిర్ణయిస్తామన్నారు. సభకు ఆటంకం కలిగించాలని ముందుగానే ఒక ఉద్దేశాన్ని పెట్టుకొనే వారు (టీడీపీ సభ్యులు) సభకు వచ్చినట్టుగా ఉందన్నారు. నిరంతరాయంగా నినాదాలతో టీడీపీ సభ్యులు సభను ఆటంకపరిచే ప్రయత్నం చేశారన్నారు. తాను ప్రత్యక్షంగా చర్యలు తీసుకునేముందు కొన్ని సంప్రదాయాలు, నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
ఇవేమైనా బేరసారాలా?
ఉదయం నుంచి సుమారు రెండు గంటల పాటు చాలా సహనంతో ‘వెళ్లి కూర్చోండి.. మీకు మాట్లాడే అవకాశం ఇస్తాం’ అని విపక్ష సభ్యులను కోరినట్లు స్పీకర్ గుర్తు చేశారు. ‘మాకు మైక్ ఇస్తేనే కూర్చుంటాం అని ప్రతిపక్ష సభ్యులు అంటున్నారు. ఇది ఏమైనా బేరసారాలా? ఒప్పందమా? ఇది శాసనసభ. నియమావళి ప్రకారం అంతా వ్యవహరించాలి. అవకాశం ఇస్తామని సభాపతిగా నేను చెబితే వారు వినకుండా మైక్ ఇస్తేనే వెళ్తామని అంటున్నారు. అంటే వీరు (ప్రతిపక్ష సభ్యులు) ముందస్తు నిర్ణయాల ప్రకారం సభకు వచ్చారని భావిస్తున్నా. మంగళవారం కూడా ఇలాగే వ్యవహరించారు. పైగా ప్రతిపక్ష సభ్యులు మమ్మల్ని సస్పెండ్ చేస్తే వెళ్లిపోతాం అంటున్నారు’ అని స్పీకర్ పేర్కొన్నారు. ‘అవకాశం ఇస్తామని చెప్పినా కూర్చోకుండా చివరకు స్పీకర్ వ్యవహారశైలికి నిరసనగా వెళ్లిపోతున్నాం అనడం ఏమిటి? దీన్ని ఏమనుకోవాలి? పదే పదే కోరినా అదే వాదనతో సభలో గందరగోళం సృష్టించటం ముందస్తు ఆలోచన కాదంటారా? సభలోకి వస్తూనే తమ స్థానాల్లో కూర్చోకుండా నేరుగా పోడియం వద్దకు రావటం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
సభ ఆమోదించిన బిల్లుపై చర్చేమిటి?
‘అసెంబ్లీలో 151 మంది వైఎస్సార్ సీపీ సభ్యులు, జనసేన నుంచి ఒక శాసన సభ్యుడు కూడా ఉన్నారు. సభ్యులు శాసనసభ ద్వారా ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ప్రజల సమస్యలు చెప్పుకోవాలని అనుకుంటారు. వారి హక్కులను హరించే అధికారం ప్రతిపక్షానికి లేదు. మూడు రాజధానులపై ఈ సభలో నిర్ణయం జరిగింది. అది ప్రభుత్వ నిర్ణయం. అది మంచిదా, చెడ్డదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. దీనిపై టీడీపీ సభ్యులు తమ అభిప్రాయాలను చెప్పారు. ఆ బిల్లును సభ ఆమోదించింది. సభ ఆమోదించిన తర్వాత కూడా టీడీపీ సభ్యులు అదే అంశాన్ని పట్టుకొని కూర్చోవటం సరికాదు. మీ అభిప్రాయాన్ని మీరు సభలో చెబుతున్నారు. ప్రజలు అంతా మన వైఖరిని గమనిస్తున్నారు’ అని స్పీకర్ పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కారాదని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment