
హైదరాబాద్: ఓటమి భయంతోనే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు బయలుదేరారని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఇంటికి పంపించి తెలంగాణలో బహుజనులం రాజ్యాధికారాన్ని దక్కించుకుందామని పిలుపునిచ్చారు. ఆదివారం భోలక్‌పూర్ డివిజన్‌లో ‘బహుజనులకు రాజ్యాధికారం’అనే అంశంపై బీఎల్‌ఎఫ్ ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ దశరథ్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు.
తమ్మినేని మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయన్నారని.. కానీ కేసీఆర్ కుటుంబ బతుకులు మాత్రమే మారాయని ఎద్దేవా చేశారు. అటు బీజేపీతో, ఇటు ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ కడుతున్నారని, ఇలాంటి ద్వంద్వ రాజకీయాలను ఎండగట్టాలని కోరారు. ఎన్నికల్లో అన్ని స్థానాలకు బీఎల్‌ఎఫ్ పోటీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు, బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఉల్లా ఖాన్, నల్లా సూర్యనారాయణ, నర్సింహారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.