ఆనం వివేకానందరెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(67) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న టీడీపీ నేత ఆనం కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు తొలుత నెల్లూరులో చికిత్స చేయించుకున్నారు. మెరుగైన వైద్యాన్ని డాక్టర్లు సూచించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అయితే కిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆనం తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఆనం వివేకా మృతిపట్ల ప్రముఖుల సంతాపం
ఆనం వివేకా మృతిపట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆనం వివేకా మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనం కుటుంబ సభ్యులకు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు కళా వెంకట్రావు, నారాయణ, నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆనం వివేకా మృతిపట్ల సంతాపం తెలిపిన అనంతరం నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ.. ఓ విలక్షణ రాజకీయ నాయకుడిని కోల్పోయామన్నారు.
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, పలువురు టీడీపీ నేతలు కిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఆనం వివేకాను పరామర్శించిన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా ఆనం అనారోగ్యంతో బాధపడుతున్నారని, రేడియేషన్ చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావు కొన్ని రోజుల కిందట తెలిపారు.
గురువారం అంత్యక్రియలు
రేపు (గురువారం) నెల్లూరులో ఆనం వివేకా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేతల్లో ఆనం వివేకానందరెడ్డి ఒకరు. ఆనం వివేకా సోదరుడు, టీడీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రిగా, ఆర్థికమంత్రిగా గతంలో పలు శాఖలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించే ఆనం వివేకా.. 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొంది మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయన 1950 డిసెంబర్ 25న జన్మించారు. ఆనంకు భార్య హైమావతి ఆనం, సంతానం ఆనం చెంచు సుబ్బారెడ్డి, ఆనం రంగా మయూర్ రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment