టీడీపీలో టోల్‌గేట్ చిచ్చు
► వివాదంపై మంత్రి నారాయణ, శిద్దా అసహనం
► మాజీ మంత్రి ఆనం బినామీ పేరుతో టెండర్ దక్కించుకున్నారని ఆరోపణలు
► ఏడాదికి రూ.24 కోట్లు కొల్లగొట్టేలా స్కెచ్ వేశారని టీడీపీ వర్గాల ప్రచారం
► తాను అలాంటి బ్యాచ్ వాడిని కాదని, కాంట్రాక్టర్లతో మాట్లాడలేదన్న ఆనం
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకుల్లో టోల్ గేట్ చిచ్చు భగ్గు మంది. కర్నూలు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో కలిసి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బినామీ పేరుతో టోల్‌గేట్ చేజిక్కిం చుకునేలా రాజకీయం నడిపారని పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. టోల్‌గేట్‌ను రద్దు చేస్తున్నట్లు తాము ప్రకటించినా మళ్లీ ఈ వ్యవహారం తెర మీదకు రావడంపై మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొండాయపాలెం వద్ద జాతీయ రహదారుల సంస్థ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) గత ఏడాది టోల్‌గేట్ ఏర్పాటుకు ప్రయత్నించింది. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో టోల్‌గేట్ ఏర్పాటు చేయరాదు. కొండాయపాలెం టోల్‌గేట్ ఈ నిబంధనకు విరుద్ధం కావడంతో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రజల తరపున పోరాటం ప్రారంభించారు. సమస్యను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీధర్‌రెడ్డి పోరాటానికి సిటీ ఎమ్మెల్యే అనికుమార్‌యాద్‌వోతోపాటు అఖిలపక్ష నాయకులు మద్దతు పలికారు. వీరంతా టోల్‌గేట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేయడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాఫ్ పడింది. టోల్‌గేట్ ఏర్పాటు రద్దు చేసినట్లు మంత్రులు నారాయణ, శిద్దారాఘవరావు ప్రకటించారు.
రహస్యంగా టెండర్లు
టోల్‌గేట్ విషయాన్ని జనం మరచిపోయారు. అయితే గత నెల 29వ తేదీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆన్‌లైన్‌లో టోల్‌గేట్ ఏర్పాటుకు ఆన్‌లైన్‌తో టెండర్లు ఆహ్వానించింది. ఈనెల 5వ తేదీ టెండర్ల దాఖలుకు చివరి గడువుగా నిర్ణయించింది. ఆర్నెల్లకు రూ.26.06 కోట్లు వసూలు లక్ష్యంగా నిర్ణయించింది. రహస్య టెండర్లపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి ఆందోళనకు దిగారు. టెండర్ల దాఖలుకు చివరి రోజైన గురువారం ఆన్‌లైన్‌లో ఐదుగురు కాంట్రాక్టర్లు నామినేషన్లు వేయగా, గడువు ముగియడానికి కొన్ని నిమిషాల ముందు కర్నూలుకు చెందిన శ్రీసాయి ఎంటర్ ప్రైజెస్ సంస్థ టెండర్ దాఖలు చేసింది. వెంకటాచలం టోల్‌గేట్‌లో రోజుకు రూ .4 లక్షల నుంచి రూ.15 లక్షలు వసూలు అవుతోంది.
కొండాయపాలెం టోల్‌గేట్‌లో కూడా కాస్త అటు ఇటుగా అంతే మొత్తం వసూలు కావాలి. ఈ లెక్కన ఏడాదికి రూ.54 కోట్ల దాకా వసూలు కావాలి. అయితే టెండర్ ధర ఖరారులోనే దీన్ని సగానికి సగం తగ్గించి రూ.26.06 కోట్లుగా నిర్ణయించి టెండర్లు ఆహ్వానించారు. ఇందులో నెలకు రూ.2 కోట్లు చొప్పున ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వ్యూహం అమలు చేశారు. రోజుకు రూ.14 లక్షల దాకా వసూలయ్యే టోల్‌గేట్‌ను రోజుకు రూ 6.60 లక్షలు చెల్లించేలా టెండర్ ఖరారు చేయడానికి తెర చాటు వ్యవహారాలన్నీ పూర్తి చేశారు.
ఆనం ఎంటరయ్యారా?
టోల్‌గేట్ ఏర్పాటే వద్దని ప్రజలు తిరగబడుతుంటే కర్నూలు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి సన్నిహిత సంస్థతో కలిసి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బినామీ పేరుతో ఈ టోల్‌గేట్ దక్కించుకోవడానికి రాజకీయం చేశారని టీడీపీలోని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. ఈ విషయం గురించి కాంట్రాక్టర్లతో ఆయనే స్వయంగా మాట్లాడారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి ఇబ్బందులు పడిన తాము ఇంకా అలాగే ఉంటే, పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీలోకి వచ్చిన ఆయన సెలైంట్‌గా ఈ తరహా వ్యవహారాలు చేస్తున్నారని ఆ వర్గం మండిపడుతోంది.
టోల్‌గేట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కార్పొరేషన్ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసినా మళ్లీ ఈ వ్యవహారం తెర మీదకు రావడానికి ఈ రాజకీయమే కారణమని టీడీపీ కార్పొరేటర్లు సైతం ఆఫ్‌ది రికార్డ్‌లో ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఈ తంతు తనకు కూడా రుచించలేదనీ సీఎంతో మాట్లాడి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీద ఒత్తిడి తెచ్చి టోల్‌గేట్‌లేకుండా చేస్తానని మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పార్టీ ముఖ్యుల వద్ద చెబుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం అధికార పార్టీలో పెద్ద చిచ్చే రగిల్చే పరిస్థితి తీసుకుని వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.
నగరం మొత్తం ప్రమాదాల జోన్ అవుతుంది
కొండాయపాలెం వద్ద టోల్‌గేట్ ఏర్పాటు అయితే వాహనాలు ఈ పన్ను తప్పించుకోవడానికి అయ్యప్యగుడి మీ దుగా నగరంలోకి వచ్చి చిన్న పిల్లల పార్కు మీదుగా టోల్‌గేట్ దాటుకుని వెళ్లడం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా నగరంలో రోడ్డు భారీగా దెబ్బ తినడంతో పాటు, నగరం మొత్తం ప్రమాదాల జోన్‌గా మారుతుంది. ఈ కారణంగానే ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నేను అలాంటి బ్యాచ్ కాదు : ఆనం రామనారాయణరెడ్డి
జిల్లాలో తెలుగుదేశం పార్టీలో నలుగురైదుగురు మాజీ మంత్రులు ఉన్నారు. వీరిలో ఎవరు టోల్‌గేట్ వ్యవహారంలో తల పెట్టారో నాకు తెలియదు. నేనైతే ఇలాం టి వ్యవహారాలు నడిపే బ్యాచ్ కాదు. కొండాయపాలెం టోల్‌గేట్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. బినామీ పేరుతో టోల్‌గేట్ దక్కించుకోబోతున్నాని చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. ఏ కాంట్రాక్టర్‌తోనూ తాను మాట్లాడలేదని ఆనం అంటున్నారు.