వినాయకుడు మైలపడతాడని దూషించారు : ఎమ్మెల్యే శ్రీదేవి | TDP Leaders Abusing Comments On YSRCP MLA Sridevi | Sakshi
Sakshi News home page

వినాయకుడు మైలపడతాడని దూషించారు : ఎమ్మెల్యే శ్రీదేవి

Published Tue, Sep 3 2019 2:08 PM | Last Updated on Tue, Sep 3 2019 2:35 PM

TDP Leaders Abusing Comments On YSRCP MLA Sridevi - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ నాయకుల దాష్టీకాలకు అడ్డులేకుండా పోతోంది. గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించారు. వేడుకల్లో దళితులు పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల గతేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం అనంతవరంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఒక దళిత ఎమ్మెల్యే పట్ల టీడీపీ నాయకులు ఈ విధంగా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీడీపీ కార్యకర్తల తీరును ఆమె మీడియా ఎదుట దుయ్యబట్టారు.

‘కుల వివక్ష అనేది రాష్ట్ర రాజధానిలో కనిపించడం దారుణం. సామాజిక వర్గం పేరుతో నన్ను మానసికంగా కుంగతీశారు. వినాయకుడిని ముట్టుకుంటే మైల పడుతుందని ఒక సామాజిక వర్గం నేతలు నన్ను దూషించారు. రాజధానిలో జరుగుతున్న అవినీతిని వెలికితీసినందుకే నన్ను మానసికంగా వేధిస్తున్నారు. చెప్పరాని మాటలంటున్నారు. గతంలో చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడారు. యథా రాజా తదా ప్రజా అన్నట్లు ఆయన బాటలోనే టీడీపీ నాయకులు నడుస్తున్నారు. వారికి కుల రాజకీయం తలకెక్కింది. రాజధానిలో వైస్సార్సీపీ గెలవడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.

రాజధానిలో వైస్సార్‌సీపీని ఓడించాలని టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. గతంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులు శుభ్రంగా ఉండరని చులకనగా మాట్లాడారు. ఇంతటి కుల వివక్ష దేశంలో ఎక్కడా చూడలేదు. నన్ను కులం పేరుతో తిట్టిన వారినే కాకుండా చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలి. తనపై కుల వివక్షతకు పాల్పడిన వారిని పెంచి పోషించింది చంద్రబాబే. రాజధానిలో దళితులను చిత్రవధ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ ఒక దళిత నేతేనా. ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే చూస్తూ ఉరుకుంటారా. రాజధానిలో భూములు ఇచ్చిన  దళితులకు ప్యాకేజీలో వివక్ష చూపించారు. టీడీపీ నేతల దాడులను తట్టుకునే పరిస్థితిలో దళితులు లేరు. దళితులు టీడీపీపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నన్ను దూషించిన వారిని అరెస్ట్ చేయడమే కాకుండా కఠినంగా శిక్షించాలి’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement