సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: రాజధాని ప్రాంతంలో తాడికొండ వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించి, దాడికి దిగిన టీడీపీ నేతల ఉదంతం కలకలం రేపింది. సోమవారం వైఎస్సార్ వర్థంతి సందర్భంగా శ్రీదేవి తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామానికి వెళ్లారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు పోలు రమేశ్ ఆహ్వానం మేరకు వినాయకుడి విగ్రహం వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లి పూజ చేస్తుండగా టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు పెద్దగా అరుస్తూ.. దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని, పూజ చేయొద్దని ఆమె వైపునకు దూసుకెళ్లారు. అంతటితో ఆగకుండా తీవ్ర పదజాలంతో కులం పేరుతో ఆమెను దూషించారు. ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడటమే కాకుండా అడ్డుకోబోయిన పోలీసులను సైతం నెట్టిపడేశారు. తనను దారుణమైన పదజాలంతో దూషించడంతో ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి లోనై కంటతడి పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ వట్టికూటి గౌతమి కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితుల్లో కొమ్మినేని శివయ్య, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకుని వారిని తుళ్లూరు డీఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు కొమ్మినేని రామకృష్ణ, బుజ్జి పరారీలో ఉన్నారు.
భగ్గుమన్న దళిత సంఘాలు
ఎమ్మెల్యే శ్రీదేవి పట్ల టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును వైఎస్సార్‌సీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తీవ్రంగా ఖండించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్‌కుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) ఏపీ శాఖ అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అ«ధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, ఏపీ నాయీ బ్రాహ్మణ జేఏసీ కన్వీనర్ తాటికొండ నరసింహారావు, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిగ టీడీపీ నేతల కుల దురహంకారంపై మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ బర్రె శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.
రాజధాని కుంభకోణాలను ప్రశ్నిస్తున్నాననే: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
దేశంలో ఎక్కడా లేని కులవివక్ష రాష్ట్ర రాజధానిలోనే కనిపిస్తోందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆహ్వానం మేరకు వెళ్లి వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్నానని తెలిపారు. కొందరు టీడీపీ నేతలు తాను మండపంలోకి వెళితే వినాయకుడు మైలపడతాడంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. అంతటితో ఆగకుండా పెద్ద పెద్ద అరుపులతో అసభ్యకరంగా మాట్లాడారని వాపోయారు. బూతు పదజాలంతో తనను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుసరించిన దళిత వ్యతిరేక వైఖరే దీనికి ప్రధాన కారణమన్నారు. గతంలోనూ చంద్రబాబుతోపాటు ఆదినారాయణరెడ్డి, చింతమనేని వంటివారు దళితులను అవమానిస్తూ మాట్లాడారన్నారు. తనను దూషించిన నలుగురితోపాటు వారికి కులపిచ్చి తలకెక్కించిన చంద్రబాబును కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిలో టీడీపీ నేతల అవినీతి, అక్రమాలను, కుంభకోణాలను ఆధారాలతో సహా ప్రశ్నిస్తున్నాననే ఈ దారుణానికి తెగించారన్నారు. వారి బెదిరింపులకు భయపడనని, కుంభకోణాలను ప్రశ్నిస్తూనే ఉంటానని, టీడీపీ నేతలకు శిక్ష పడేవరకు పోరాటం ఆగదని తెలిపారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
– మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులను కోరారు. ఈ విషయంపై గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మితో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పద్మ ప్రకటన విడుదల చేశారు. మహిళా ఎమ్మెల్యేని కించపరుస్తూ దూషిస్తూ దేవుడి దగ్గరకు వస్తే మైలపడిపోతారని మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యే శ్రీదేవిని పరామర్శించానని, మహిళా ప్రజాప్రతినిధులకు మహిళా కమిషన్ పూర్తి స్థాయి అండదండలు అందిస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment