ముద్దన్న ఇక లేరంటే బాధగా ఉంది... | TDP Leaders Condolences on Gali Muddu Krishnama Naidu | Sakshi
Sakshi News home page

ముద్దన్న ఇక లేరంటే బాధగా ఉంది...

Published Wed, Feb 7 2018 10:46 AM | Last Updated on Wed, Feb 7 2018 2:23 PM

TDP Leaders Condolences on  Gali Muddu Krishnama Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని తెలంగాణ టీడీపీ నేత ఎల్‌ రమణ అన్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ...‘ చాలా దురదృష్టకరమైన రోజు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి. వాస్తవానికి అనుగుణంగా, నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. చిత్తూరు జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సేవ చేశారు. తెలంగాణ ప్రాంతంలో మాలాంటి వారిని ప్రోత్సాహం ఇచ్చేవారు.’ అని అన్నారు.

ముద్దన్న లేడంటే బాధగా ఉంది...
రావుల చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ముద్దన్న అంటూ ప్రేమగా పిలిచే వ్యక్తి ఇక లేరంటే ఎంతో బాధగా ఉంది. ఎన్టీఆర్‌కు అత్యంత ఆత్మీయుడిగా, రాజకీయాల్లో ఎందరికో ప్రోత్సహం, స్పూర్తిని ఇచ్చిన వ్యక్తి. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని అన్నారు.

చివరి వరకూ పేరు నిలుపుకున్నారు..
గాలి ముద్దుకృష్ణమనాయుడు మంచి రాజకీయాలకు నిదర్శనమని, ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి చివరి వరకూ పేరు నిలపుకున్నారని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఎన్టీఆర్‌ నాటిన రాజకీయ మొక్క...
ఎన్టీఆర్‌ నాటిన రాజకీయ మొక్క అంచలంచెలుగా ఎదిగి ఎందరికో రాజకీయంగా స్పూర్తినిచ్చారని తెలంగాణ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆయన మరణం తెలుగు రాజకీయాల్లో తీరిని లోటు అని పేర్కొన్నారు.

కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి
గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు మృతికి వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా సంతాపం తెలిపారు. చిత్తూరు జిల్లాలోనే సీనియ‌ర్ నాయ‌కుల్లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డం దుర‌దృష్ట‌క‌రమన్నారు. ‘ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ప‌నిచేసిన సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన ముద్దు కృష్ణ‌మ‌నాయుడు మ‌ర‌ణించ‌డం చిత్తూరు జిల్లాకు తీర‌ని లోటు. ఒక సాధార‌ణ ఉపాధ్యాయుడిగా ప‌నిచేసిన ముద్దుకృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేయ‌డం ఆయ‌న జీవితంలోని అరుదైన సంద‌ర్భం. తెలుగుదేశం పార్టీలో నేను ఆయ‌న క‌లిసి ప‌నిచేసిన సంద‌ర్భాలు ఈ సంద‌ర్భంగా నాకు గుర్తొస్తున్నాయి. ఆరుసార్లు పుత్తూరు, న‌గ‌రి ఎమ్మెల్యేగా ప‌నిచేసిన ఆయ‌న నిరాండ‌బ‌రుడుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు అకాల‌ మ‌ర‌ణానికి చింతిస్తూ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నా.’  అని రోజా తెలిపారు.

‘ఆయన మరణం నా మనసును కలిచివేసింది’
గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం తన మనసును కలిచివేసిందని సీనియర్‌ నటుడు మంచు మోహన్‌ బాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు ఆ శిరిడి సాయినాధుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మోహన్‌ బాబు పేర్కొన్నారు. ‘తిరుపతిలో చదువుకునే రోజుల్లో నేనూ, గాలి ముద్దుకృష్ణమనాయుడు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. ఆయన సోదరుడు నా క్లాస్ మేట్. నాకు అత్యంత సన్నిహితుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఎన్నికల సమయంలో ఆయన తరపున ఎన్నోసార్లు ప్రచారానికి కూడా వెళ్ళాను. అలాంటి మిత్రుడి హఠాన్మరణం నా మనసును కలచి వేసింది.’  అని అన్నారు.

రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తి : లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన గాలి ముద్దుకృష్ణమనాయుడు మచ్చలేని వ్యక్తిగా కొనసాగరని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన కృషి ఎనలేనిదన్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement