
జడ్పీ కార్యాలయం అధికారులకు రాజీనామా పత్రాన్ని అందిస్తున్న మడకశిర జడ్పీటీసీ సులోచనమ్మ
మడకశిర: మడకశిర నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్ తగిలింది.ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీ ముఖ్య నేతలు ఆ పార్టీని వీడుతుండడంతో కేడర్ పూర్తిగా డీలా పడిపోయింది.ఏం చేయాలో తెలియక టీడీపీ ప్రముఖులు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ముఖ్యంగా మడకశిర టీడీపీ జడ్పీటీసీ, ప్రముఖ టీడీపీనేత కరణాకర్‌రెడ్డి సతీమణి సులోచనమ్మ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా కేంద్రంలో జడ్పీ కార్యాలయంలోని అధికారులకు అందించారు.వెంటనే తాను జడ్పీటీసీ పదవికి ఇచ్చిన రాజీనామాను ఆమోదించాలని కోరారు.
ఒకప్పుడు మడకశిర నియోజకవర్గ రాజకీయాలను శాసించిన మాజీ ఎమ్మెల్యేలు వైసీతిమ్మారెడ్డి, వైవీ తిమ్మారెడ్డి కుటుంబానికి చెందిన సులోచనమ్మ టీడీపీ జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మడకశిర మండలంలో సులోచనమ్మ భర్త కరుణాకర్‌రెడ్డి టీడీపీలో ముఖ్య నాయకుడు.ఆయనకు ప్రస్తుత టీడీపీ అభ్యర్థి ఈరన్నతో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. ఆయనను ఎమ్మెల్సీ గుండుమలతిప్పేస్వామి,టీడీపీ అభ్యర్థి ఈరన్న బుజ్జగించినా ఫలితం లేదు. ఎట్టి పరిస్థితిలో టీడీపీలో ఉండమని ఆయన వారికి తేల్చి చెప్పారు.
నేడు వైఎస్సార్‌సీపీలో చేరిక
మడకశిరకు శనివారం వైఎస్ జగన్‌మోహ న్‌రెడ్డి రానున్నారు.ఈనేపథ్యంలో టీడీపీకి,తన పదవికి రాజీనామా చేసిన మడకశిర జడ్పీటీసీ సులోచనమ్మ, భర్త కరుణాకర్‌రెడ్డి తదితరులు వందలాదిమంది వైఎస్‌జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నారు. అంతే కాకుండా వీరితో పాటు ఇటీవలనే టీడీపీకి రాజీనామా చేసిన ప్రముఖులు హల్కూరు కాంతరాజు,అగళి వెంకటస్వామి,వారి అనుచరులు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు.