ఈ ఎమ్మెల్యేలు మాకొద్దు.. | TDP Leaders Protest Against MLA Anitha And Vasupalli Ganesh | Sakshi
Sakshi News home page

సిట్టింగులకు సెగలు

Published Thu, Feb 21 2019 7:51 AM | Last Updated on Thu, Feb 21 2019 1:15 PM

TDP Leaders Protest Against MLA Anitha And Vasupalli Ganesh - Sakshi

ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత.. ఇటీవలి కాలంలో పార్టీ నుంచి నేతల వలసలతో విలవిల్లాడుతున్న జిల్లా తెలుగుదేశం పార్టీని ఇంటిపోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సిటింగ్‌ ఎమ్మెల్యేలపై అసమ్మతి నేతలు సెగలు కక్కుతున్నారు.

 ‘ఈ ఎమ్మెల్యేలు మాకొద్దు.. మళ్లీ వారికే టికెట్లు ఇస్తే ఓడిస్తాం’.. అంటూ రోడ్డెక్కి మరీ పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకేరోజు ముగ్గురు ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడంతో పార్టీ అధిష్టానం తలపట్టుకుంటోంది.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్న పార్టీ అధినేతకు ఈ అసమ్మతి కుంపట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.పాయకరావుపేటలో ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా వందలాది టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి.. ఈ ఎమ్మెల్యే మాకొద్దని నినదించారు.

విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడు కూడా అయిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు టికెట్‌ ఇవ్వొద్దని ఆ నియోజకవర్గ పార్టీ మైనారిటీ, మహిళా విభాగాల నేతలు, మాజీ కార్పొరేటర్లు ప్రెస్‌మీట్‌ పెట్టి డిమాండ్‌ చేశారు.

ఇక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌పై అక్కడి టీడీపీ సీనియర్‌ నేత, మాజీ కార్పొరేటర్‌ లేళ్ల కోటేశ్వరరావు ఎదురుతిరిగారు. కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకపోతే వారే పార్టీ అభ్యర్థులను ఓడిస్తారని.. తాను కూడా పోటీలో ఉంటానని అల్టిమేటం జారీ చేశారు.

సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ అధికార టీడీపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై అసంతృప్తి రాజుకుంటోంది. నిన్న గాక మొన్న మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుని తీరు పట్ల మంత్రి సోదరుడు సన్యాసిపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావుపై అసంతృప్తితో భీమిలి నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. మాడుగులలో పార్టీ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడుపై సొంత పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలే గ్రూపుకట్టి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తాజాగా ఒకే రోజు ముగ్గురు ఎమ్మెల్యేలపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ పార్టీ అదిష్టానానికి అల్టిమేటంఇవ్వడమే కాదు.. ర్యాలీలు, ధర్నాలతో రోడ్డెక్కడం సిట్టింగులపై ఏ స్థాయిలో వ్యతిరేకత పెల్లుబికుతుందో తేటతెల్లమవుతోంది.

అనితపై ఆగ్రహజ్వాలలు
పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితపై గత కొన్ని రోజులుగా అసమ్మతి రాజుకుంటోంది. ఇన్నాళ్లూ ఆమె అవినీతికి వ్యతిరేకంగా పార్టీ సమావేశాల్లో గళం విప్పిన నేతలు ఇప్పుడు రోడ్లెక్కారు. రానున్న ఎన్నికల్లో అనితకు టిక్కెట్‌ ఇవ్వొద్దని, ఒక వేళ ఇస్తే ఓడిస్తామంటూ  పాయకరావుపేట పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో పార్టీ నేతలు, వందలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో  జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేష్, మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన, నక్కపల్లి కోఆప్షన్‌ జడ్పీటీసీ కొప్పిశెట్టి కొండబాబు తదితరులు అనిత విజయానికి పనిచేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె తీరు మారిపోవడంతో.. ఒక్కొక్కరుగా ఆమెకు దూరమయ్యారు. రెండేళ్ల పాటు గుంభనంగా ఉన్న వారంతా ఎన్నికల ముంగిట అసమ్మతి గళమెత్తారు. గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోటనగేష్, విశాఖ డెయిరీ డైరెక్టర్‌  రెడ్డి రామకృష్ణ, నక్కపల్లి మాజీ  ఎంపీపీ బొల్లం బాబ్జి, మరో మాజీ ఎంపీపీ, అతని బందువులు, ఎస్‌రాయవరం పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్షుడు దండు గణపతిరాజు, పాయకరావుపేట మాజీ వైస్‌ ఎంపీపీ గొర్లె రాజబాబు, సీనియర్‌ నేతలు దేవవరపు వెంకటరమణ,  చింతకాయల రాంబాబు, కోటవురట్ల మాజీ వైస్‌ ఎంపీపీ ఈశ్వర చంద్రమూర్తి, సీనియర్‌ నాయకుడు వేగి శ్రీనివాసరావు తదితరులు ఇప్పటికే అనితపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. రెండునెలల క్రితం తోటనగేష్‌ తన వర్గీయులతో రహస్య సమావేశం నిర్వహించి వారి మద్దతు కూడగట్టారు.

ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా పాయకరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులు
అలాగే నెలరోజుల క్రితం నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో  ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న వారితో మరో సమావేశం నిర్వహించి అసమ్మతి కార్యకలాపాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. తాజాగా పదిరోజుల క్రితం కోటవుటర్లలో నియోజకవర్గంలోనాలుగు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్య నేతలతో మరో సమావేశం నిర్వహించి బాహటంగానే అనితపై విమర్శనాస్త్రాలు సంధించారు. అనితకు టికెట్‌ ఇస్తే ఓడించి తీరుతామని, ఆ ప్రభావం అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విజయావకాశాలపై కూడా పడుతుందని హెచ్చరించారు. తాజాగా పాయకరావుపేట పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు కూడా అసమ్మతి గూటికి చేరారు. అనిత అవినీతిలో కూరుకుపోయింందంటూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు రంగ ప్రవేశం చేశారు. చంద్రబాబుతోపాటు, పార్టీ సీనియర్‌ నేతలు కళావెంకటరావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడులను కలుస్తూ తనకు లేదా తన కుమార్తె వెంకటలక్ష్మికి  అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పార్టీ పెద్దల నుంచి ఆ మేరకు హమీ లభించిందని చెప్పుకుంటూ అసమ్మతి నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆయన రంగప్రవేశం చేసినప్పటి నుంచి పార్టీలో అసమ్మతి ఊపందుకుంది.

వాసుపల్లిపై అసంతృప్తి సెగలు
విశాఖ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై సొంత పార్టీలో అసంతృప్తి ఎగసిపడుతోంది. గతేడాది వాసుపల్లి తీరుకు నిరసనగా ఆ పార్టీకి చెందిన దళిత నేతలు పార్టీ కార్యాలయంలోనే ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. తాజాగా వాసుపల్లికి టికెట్‌ ఇస్తే ఓడించి తీరుతామంటూ అర్బన్‌ టీడీపీ మైనార్టీ వింగ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ సాదిక్, మాజీ కార్పొరేటర్‌ చెన్నా రామారావు, తెలుగు మహిళ మాజీ ఉపాధ్యక్షురాలు గొర్ల అప్పలనర్సమ్మ తదితరులు బుధవారం విలేకర్ల సమావేశం పెట్టి మరీ తేల్చిచెప్పారు. నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రశ్నించిననేతలపై ఎమ్మెల్యే స్వయంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వారు మండిపడ్డారు. తన కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులతో బెదిరింపులకు దిగుతున్నారని, ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషిస్తున్నారంటూ.. ఇంకా పలు ఆరోపణలు చేశారు.

పల్లాకు పాకిన సెగలు
పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టిన వారికి మళ్లీ టికెట్‌ ఇస్తే కార్యకర్తలే ఓడిస్తారని మాజీ కార్పొరేటర్, టీడీపీ సీనియర్‌ నేత లేళ్ల కోటేశ్వరరావు హెచ్చరించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి ఎవరికి టికెట్‌ ఇచ్చినా ఒకే అంటూనే.. తాను కూడా టికెట్‌ రేసులో ఉన్నానని చెప్పుకొచ్చారు. కార్యకర్తలను పక్కన పెట్టిన వారికి టికెట్లు ఇస్తే గెలిపించేందుకు కార్యకర్తలు సిద్దంగా లేరంటూ ఎమ్మెల్యే పల్లానుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తీరు వల్లే మాజీ కార్పొరేటర్‌ కోన తాతారావు, వార్డు అధ్యక్షులు చిత్తా కనకరాజు, కరణం కనకారావు తదితరులు పార్టీని వీడారని గుర్తు చేశారు. మళ్లీ పల్లాకు టికెట్‌ ఇస్తే చాలా మంది పార్టీని వీడతారంటూ హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement