
జీవీఎంసీ గాంధీ విగ్రహం ఆవరణలో వాదులాడుకుంటున్న తెలుగు మహిళలు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ జిల్లా మహిళా నేతల మధ్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సాక్షిగా విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. మద్యపాన నిషేధంపై శనివారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత.. విశాఖ పార్లమెంట్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ర్యాలీలో తనకు చోటు కల్పించకుండా ఎందుకు పక్కకు నెడుతున్నారంటూ అనంతక్ష్మిని నిలదీశారు. దీంతో వివాదం మొదలైంది.
చదవండి: బాబూ.. తిట్టేశాం! చంద్రబాబుకు చెప్పుకున్న తిరుపతి టీడీపీ నేతలు
కార్యక్రమాలు మేం నిర్వహిస్తున్నామంటూ అనంతలక్ష్మి బదులియ్యడంతో.. పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారో అందరికీ తెలుసనీ.. పదవి వచ్చిన తర్వాత.. ఇష్టం వచ్చినట్లు ఎవరుపడితే వాళ్ల దగ్గర నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సుజాత అన్నారు. ఎవరికి పదవి ఎలా వచ్చిందో తమకు తెలుసనీ.. సభ్యతగా మాట్లాడాలని అనంతలక్ష్మికి ఆమె సూచించారు.
సామాజిక వర్గాన్ని తక్కువ చేసి నోరుజారి మాట్లాడితే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని సుజాత హెచ్చరించారు. ఇరువురి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుతుండటంతో అనిత కలుగజేసుకుని మీడియా ఉన్న దగ్గర గొడవలు వద్దని సర్ది చెప్పారు. ఇలా తెలుగు మహిళల మధ్య మొదలైన ప్రోటోకాల్ వివాదం.. వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. అనంతలక్ష్మి వ్యవహారంపై టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సుజాత ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment