
సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:‘మనమంతా ఇక్కడే ఎదిగాం.. ప్రభుత్వం ఈ నగరాన్ని కార్యనిర్వాహక రాజధాని చేస్తామంటే మద్దతివ్వాల్సిన కనీస బాధ్యత మనకుంది.. మిగిలిన విషయాలు, అనుమానాలు, అపోహల గురించి తర్వాత మాట్లాడదాం.. ముందు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్న ప్రతిపాదనను మనం బేషరతుగా సమర్ధించాల్సిందే.. ప్రభుత్వానికి మద్దతివ్వాల్సిందే.. ’ అని జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు తీర్మానించడం చర్చకు తెరలేపింది. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని విశాఖ అర్బన్, రూరల్ జిల్లా తెలుగుదేశం పార్టీ విభాగాలుబేషరతుగా స్వాగతించాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి నగరంలోని ఓ హోటల్‌లో సమావేశమైన టీడీపీ నేతలు విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.
ప్రతినెలా ఓ రోజు డిన్నర్ మీట్ పేరుతో టీడీపీ నేతలు సమావేశమవుతుండటం కొన్నాళ్ళుగా ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలో మంగళవారం రాత్రి గాజవాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆతిధ్యమిచ్చిన సమావేశానికి జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, బుద్ధా నాగ జగదీశ్వర్‌రావు, పప్పల చలపతిరావు, పార్టీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్, రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ సహా మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద్, వంగలపూడి అనిత, కెఎస్‌ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖతో ఉన్న అనుబంధం దృష్ట్యా రాజధానిని స్వాగతించాల్సిన బాధ్యత మనపై ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.రాజధానికి కావల్సిన అన్ని హంగులూ విశాఖకు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ అభివృద్ధి చెందాల్సిన సమయమిదేనని, అందుకే తాను ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే స్వాగతించానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదించాలని నేతలు తీర్మానించారు. కార్యనిర్వాహక రాజధాని ఏర్పడితే పెరిగే జనాభాకు అనుగుణంగా చేపట్టే చర్యలపైనా, శాంతి భద్రతలపైనా ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ఓ పక్క పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సహా పార్టీ నేతలు స్వాగతించడం చర్చకు తెరలేపింది. గంటా శ్రీనివాసరావు వికేంద్రీకరణ ప్రతిపాదన వచ్చిన తొలిరోజే తాను సమర్ధిస్తున్నట్టు విస్పష్ట ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఆచితూచి వ్యవహరించిన మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు, జిల్లా టీడీపీ నేతలు మంగళవారం నాటి సమావేశం వేదికగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. సబ్బంహరితో పాటు మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ, అయ్యన్నపాత్రుడు మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment