తన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రమేష్
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసం, వ్యాపార సంస్థల్లో గత రెండు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఐటీ సోదాలు జరుగుతున్నప్పుడు రమేష్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన నివాసంలోని డిజిటల్ లాకర్ తెరవాల్సిరావడంతో హైదరాబాద్‌కు రావాల్సిందిగా రమేష్‌కు అధికారులు సమాచారమిచ్చారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న రమేష్ మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులకు భయపడడం లేదనీ, గతంలోనూ ఇలాగే చేశారని అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ నేతలు తనపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. (రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు)
ఆ లాకర్‌లో బట్టలే ఉన్నాయి..
అధికారులు తెరవాలనుకుంటున్న డిజిటల్ లాకర్‌లో కేవలం తన బట్టలు మాత్రమే ఉన్నాయని రమేష్ తెలిపారు. ఇంట్లో పనిచేసే నౌకర్ల వల్ల ఇబ్బందులు తలెత్తకూడదనే డిజిటల్ లాకర్ ఏర్పాటు చేసినట్టు రమేష్ చెప్పుకొచ్చారు. ప్రతి సంవత్సరం 200 కోట్ల రూపాయలు ఐటీ రిటర్నులు దాఖలు చేస్తానని తెలిపారు. ఐటీ అధికారులు తన భార్య పేరు మీద నోటీసులు ఇచ్చారని ఆయన వెల్లడించారు. గత నాలుగేళ్లలో 3 వందల కోట్ల రూపాయల టాక్స్ లు కట్టానని తెలిపారు. అవసరమనుకుంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పంచనామా కూడా కాపీ మీడియాకు ఇస్తానని అన్నారు.
రిత్విక్ కంపెనీ వ్యవహారాల్లో గోవర్ధన్ కీలకమా..!
సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ఆఫీసులో ఐటీ ఆధికారులు ముమ్ముర తనిఖీలు చేశారు. హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. సీఎం రమేష్ బావ గోవర్ధన్ నాయుడు ఇంట్లో కూడా గత అర్ధరాత్రి ఐటీ అధికారులు సోదాలు చేశారనీ, బంగారం, నగదు, కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గోవర్ధన్‌కు చెందిన రెండు బ్యాంకు లాకర్లను తెరచినట్టు సమాచారం. కంపెనీ ఆర్థిక కార్యకలాపాల్లో గోవర్ధన్ కీలక వ్యక్తిగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఆయనను రిత్విక్ ప్రాజెక్ట్స్ ఆఫీసుకు తరలించారు. మరోవైపు రమేష్ సోదరుడు రాజేష్‌ను కూడా అధికారులు విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment