సాక్షి, అమరావతి, హైదరాబాద్: కడప ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేసినందుకే తనపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులు చేసిందట!! ఇదీ... టీడీపీ ఎంపీ సి.ఎం.రమేష్ వాదన. అంటే... తానెలాంటి తప్పూ చేయలేదని, కేంద్రం కావాలనే కక్ష సాధిస్తోందన్నది దాని ఉద్దేశం. సరే!! మరి రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా తనకు తానే ఓ కంపెనీని సృష్టించి... దానిపేరిటే స్టాంపులు తయారు చేసి... పనులు కానిచ్చేస్తూ... దానికి కోట్ల రూపాయల బిల్లుల్ని కూడా చెల్లించినట్లు చూపిస్తున్న వ్యక్తిని ఏమనాలి? ‘‘అసలు రిజిస్టరే కాని కంపెనీ పేరిట లావాదేవీలు చేయటమన్నది మోసం! దీనిపై పోలీస్‌స్టేషన్లో 420 కింద కేసు పెడితే... విచారణలో మేమూ భాగమవుతాం’’ అని సాక్షాత్తూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) అధికారులే చెబుతున్నారు. రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్... కోట్లాది రూపాయల బిల్లుల్ని ‘ఎడ్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సబ్ కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు చూపించింది. అసలు ఈ కంపెనీయే లేదని ఆర్‌ఓసీ అధికారులే ధ్రువీకరించారు. అదీ... ఈ 420 స్టోరీ. ఎడ్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్!! ఈ పేరుమీద దేశంలోని ఏ ఆర్‌ఓసీలో చూసినా ఎలాంటి కంపెనీ ఉండదు. కానీ సి.ఎం.రమేష్ దగ్గర మాత్రం దీనికి సంబంధించిన పత్రాలుంటాయి. దీనికో చిరునామా కూడా ఉంటుంది.
ఆ చిరునామాలో మాత్రం ఏమీ ఉండదు. పైపెచ్చు ఆ కంపెనీ తనకు సబ్ కాంట్రాక్టర్ అని చెబుతూ... దానికి కోట్ల రూపాయలు చెల్లించేస్తూ ఉంటారు కూడా. ఈ కంపెనీ ఆదాయాలపై ఐటీ శాఖ అనుమానాలు వ్యక్తంచేయటంతో 2014లోనే ఈ వివాదం ఐటీ ట్రిబ్యునల్‌కు చేరింది. సరైన పత్రాలు సమర్పించమని ఎన్నిసార్లు చెప్పినా కంపెనీ నుంచి ఎవరూ రాకపోవడం, ఇచ్చిన చిరునామాలో కంపెనీ లేకపోవడంతో ఎడ్కో కంపెనీ లావాదీవీలపై ఐటీ శాఖ దృష్టి సారించింది. తాజా దాడుల్లో దాని మూలాలన్నీ రిత్విక్ కంపెనీలో తేలాయి. రిత్విక్ ప్రాజెక్టŠస్ చూపిస్తున్న లెక్కలపై ఐటీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తంచేయటం.. దీనిపై రిత్విక్ ప్రాజెక్టŠస్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం 2012 నుంచి ఏటా క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది.
మూసేసిన కంపెనీలకు పనులిచ్చారా?
ఎడ్‌కో మాత్రమే కాక రిత్విక్ నుంచి కోట్ల రూపాయల విలువ చేసే సబ్–కాంట్రాక్ట్ పనులు తీసుకున్న కంపెనీల్లో కొన్ని కంపెనీలు కార్యకలాపాలు కూడా నిలిపేయటం గమనార్హం. ఐటీ అధికారుల తనిఖీల్లో.. ఏఏకే స్టీల్స్, బీఎస్‌కే స్టీల్స్ నుంచి రూ.25 కోట్ల స్టీల్ కొనుగోలు చేసినట్లు బిల్లులు చూపించారు. కానీ, ఆర్‌ఓసీ హైదరాబాద్‌లో నమోదైన ఏఏకే స్టీల్స్‌ను ఎప్పుడో మూసేశారు. సికింద్రాబాద్ రాణిగంజ్ డిస్టెల్లరీ రోడ్ 5–4–25 పేరిట 2003 ఫిబ్రవరిలో కంపెనీ రిజిస్టరై ఉంది. కానీ తరవాత మూసేశారు. అలాంటి కంపెనీ నుంచి రమేష్ స్టీల్ ఎలా కొన్నారనేది ఆయనకే తెలియాలి.
ఎడ్కోకు బ్యాంక్ రుణాలు కూడా..!!
రిత్విక్ ప్రాజెక్టŠస్ నుంచి తీసుకున్న సబ్–కాంట్రాక్ట్ పనులను నామినీగా చూపించి పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌ల నుంచి ఎడ్కో ఇండియా రుణాలు కూడా తీసుకున్నట్లు ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్‌ఎస్) అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ బ్యాంక్ నుంచి ఎంత మొత్తంలో రుణాలు తీసుకున్నారో విచారణ చేయాల్సిందిగా తాము రిజర్వ్ బ్యాంక్‌ను కోరినట్లు పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని ఐసీఎల్‌ఎస్ అధికారి ఒకరు చెప్పారు.
రమేష్‌కు... ఇదో బోగస్ జేబు కంపెనీ
కంపెనీ పెట్టేవారెవరైనా ప్రొప్రయిటరీ సంస్థయితే సహకార రిజిస్ట్రార్ దగ్గర, ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఆర్‌వోసీలో నమోదు చేయాలి. అప్పుడే అది చట్టబద్ధమైన కంపెనీ అవుతుంది. రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ మాత్రం తనే ఎడ్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ పెట్టేసి, స్టాంపులు, సీలు తయారు చేయించేసుకుని... దానికి కోట్ల రూపాయల విలువైన సివిల్ వర్క్స్ కట్టట్టేశారు. ఈ కంపెనీ స్టాంపులు, సీలు అన్నీ రిత్విక్ అకౌంటెంట్ సాయిబాబా దగ్గర దొరకటం దీన్ని ధ్రువపరిచేదే. ఇదే విషయమై ఈ అకౌంటెంట్‌ను సంప్రతించటానికి ‘సాక్షి’ ప్రతినిధి ప్రయత్నించగా... ఎడ్కో అనే పేరెత్తగానే ఆయన అర్థంతరంగా ఫోన్ పెట్టేశారు. ఇంకా విశేషమేంటంటే... ఈ కంపెనీ పేర్కొన్న నాలుగు చిరునామాలూ బోగస్‌వే. బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 13లో కంపెనీ పేర్కొన్న చిరునామాను ‘సాక్షి’ పరిశీలించగా అక్కడ ఏ కంపెనీ లేదని బయటపడింది. చివరకు ఐటీ నోటీసులు సైతం కంపెనీకి కాకుండా సోమాజీగూడలోని ఆడిటర్ పి.మురళీ మోహన్ చిరునామాకే పంపాల్సి వచ్చింది. రిత్విక్ ప్రాజెక్స్‌కు, ఎడ్కోకు ఆడిటర్ ఒక్కరే. రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్ గత ఆరేళ్లలో రూ.12 కోట్ల విలువైన పనులను ఎడ్కోకు అప్పచెప్పినట్లు ఐటీ సోదాల్లో బయట పడింది.
బయటపడింది ఇలా..
సివిల్ కాంట్రాక్టు వర్కులు చేసే ఎడ్కో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ 2009–10 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి రూ.3.72 కోట్ల ఆదాయాన్ని చూపిస్తూ ఐటీ రిటర్నులు వేసింది. దీన్ని స్క్రూటినీ చేసిన ఐటీ శాఖ... పుస్తకాల్లోని లెక్కలకు, చేసిన వ్యయాలకు పొంతన లేనట్లు గుర్తించింది. వ్యయాలకు సంబంధించి వాస్తవ బిల్లులు, వోచర్లు లేకపోవడంతో మొత్తం బిల్లులపై 8 శాతాన్ని లాభంగా పరిగణిస్తూ ఆదాయాన్ని రూ.3.72 కోట్లు కాకుండా రూ.5.57 కోట్లుగా పరిగణిస్తూ ఐటీ శాఖ 2011లో ఉత్తర్వులిచ్చింది. సబ్ కాంట్రాక్టర్లకు 5 శాతం లాభాన్ని పరిగణనలోకి తీసుకుంటారని ఎడ్కో ఆడిటర్ వాదిస్తే... ఈ అంశాన్ని ట్రిబ్యునల్‌లో తేల్చుకోమని ఐటీ శాఖ చెప్పింది. రెండేళ్లు దాటినా కంపెనీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఐటీ అధికారులే 2014లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు ఐటీ ట్రిబ్యునల్‌లో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment