సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఎన్నికల్లో పోటీ చేయడం వల్లే తన వ్యాపార సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం ఐటీ సోదాలు చేయించిందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఆ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరినా తాను వినలేదని, అందుకే కక్ష సాధింపుగా ఈ సోదాలు జరిపించారని పేర్కొన్నారు. సీఎం రమేష్ ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీతో పెట్టుకుంటే ఇలాంటి సోదాలు జరుగుతాయని ఒక అధికారి తనను హెచ్చరించారని చెప్పారు. తనను, రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేశారని, కావాలని దాడులు చేశారని విమర్శించారు. ఈ విషయాలన్నింటినీ పీఏసీ సమావేశంలో ప్రశ్నిస్తామని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
బీజేపీ తాటాకు చప్పుళ్లకు తాను భయపడను
రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ టర్నోవర్ రూ.1,000 కోట్లకు మించి లేదని చెప్పిన సీఎం రమేష్ గత సంవత్సరం టర్నోవర్ రూ.1300 కోట్లు, ఈ సంవత్సరం టర్నోవర్ రూ.1,500 కోట్లు ఉంటుందని చెప్పడం గమనార్హం. తన కంపెనీకి నామినేషన్ విధానంలో ప్రభుత్వం రూ.లక్ష విలువైన పని కూడా ఇవ్వలేదని చెప్పారు. రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువ చేసే పనులను నామినేషన్ విధానం ద్వారా ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని వెల్లడించారు. దుమ్ముగూడెంలో గతంలో రూ.4,000 కోట్ల విలువైన పనులు వచ్చాయని, అవుకు రిజర్వాయర్‌కు సంబంధించి రూ.90 కోట్ల విలువైన పని వచ్చిందని వివరించారు. అయినా రిత్విక్ కంపెనీ రూ.2,000 కోట్ల విలువైన పనులు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తనకు సంబంధించిన 25 చోట్ల ఐటీ సోదాలు జరిపినా ఏమీ కనుక్కోలేకపోయారని అన్నారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని, తన తల తీసినా బెదరనని వ్యాఖ్యానించారు. తాను తప్పు చేసి ఉంటే ఉరి శిక్షకైనా సిద్ధమని చెప్పారు.
Published Mon, Oct 15 2018 2:56 AM | Last Updated on Mon, Oct 15 2018 2:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment