గాలి భానుప్రకాష్ ,అశోక్ రాజు , డాక్టర్ సుభాషిణి
నగరి నియోజకవర్గ రాజకీయం రంజుగా మారింది. టీడీపీ టికెట్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. దివంగత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు పెద్ద కుమారుడు భానుప్రకాష్ తనకే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అదే కుటుంబానికి చెందిన ముద్దుకృష్ణమ సతీమణి, చిన్న కుమారుడు జగదీష్ మాత్రం అకోశ్‌రాజు వెంట నడుస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి డాక్టర్ సుభాషిణి తనకు టికెట్ ఇవ్వాలని అభ్యర్థించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
సాక్షి, చిత్తూరు, తిరుపతి: నగరి తెలుగు దేశం పార్టీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో రోజుకొకరు తెరపైకి వస్తున్నారు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణానంతరం నగరి అసెంబ్లీ టికెట్ కోసం మూడువర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. గాలి పెద్ద కుమారుడు భానుప్రకాష్ ఒకవర్గం, చిన్న కుమారుడు జగదీష్ మరో వర్గంగా ఏర్పడి టికెట్ కోసం పోటీపడుతున్నారు. జగదీష్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్‌రాజుతో కలసి ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. భాను మాత్రం తన అనుచరులతో రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో కొత్తగా మహిళా డాక్టర్ తెరపైకి వచ్చారు. నగరి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సుభాషిణి రెండు రోజుల క్రితం అధినేతను కలసి తన ఆసక్తిని తెలియజేశారు. దివంగత ముద్దుకృష్ణమ కుటుంబంలోనెలకొన్న విభేదాలతో తలబొప్పి కట్టిస్తున్న నేపథ్యంలో డాక్టర్ సుభాషిణి తెరపైకి రావడం నగరిలో చర్చనీయాంశమైంది. రాజుల సామాజిక వర్గానికి చెందిన అశోక్‌రాజు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అదే సామాజిక వర్గానికే చెందిన డాక్టర్ సుభాషిణి చంద్రబాబును కలిసి వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించమని కోరడం ఇటు అశోక్‌రాజు వర్గం.. అటు భాను వర్గం జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో నగరి టీడీపీలో రాజకీయం వేడెక్కింది.
ఉత్తర.. దక్షిణ ధ్రువాలు
ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణించి ఏడాది పూర్తవుతున్నా.. టీడీపీ ఇన్‌చార్జి పదవి భర్తీకి నోచుకోలేదు. దీంతో నగరి టీడీపీ ఇన్‌చార్జ్ తనే అంటూ ఎవరికి వారు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గాలి సోదరుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు గత ఏడాది అమరావతి వేదికగా మధ్యస్తం జరిగినా ఫలితం లేకుండాపోయింది. పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ ఒక గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తుండగా, మరో గ్రూప్‌కు అశోక్‌రాజు నాయకత్వం వహిస్తున్నారు. ముద్దుకృష్ణమ సతీమణి గాలి సరస్వతమ్మ, చిన్నకుమారుడు గాలి జగదీష్, రమేష్ చంద్రప్రసాద్, పాకా రాజా తదితరులు సైతం అశోక్‌రాజు గ్రూప్‌తో జతకట్టారు. ఈ నేపథ్యంలో శనివారం అశోక్‌రాజు నిర్వహించిన సమావేశానికి గాలి సరస్వతమ్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘నగరికి మంచి నాయకుడిని ఎన్నుకోండి’ అని సూచించడం ప్రకంపనలు సృష్టించింది. గతంలో నవనిర్మాణ దీక్ష సందర్భంగా ముద్దుకృష్ణమ వారసుడు చిన్నకుమారుడు గాలి జగదీషే అని ప్రకటించి వివాదానికి తెరలేపారు. దీంతో ముద్దు కుటుంబంలో లుకలుకలు ఇంకా సద్దుమణగలేదనే విషయం కేడర్‌కు స్పష్టమైంది.
అశోక్‌రాజు తాయిలాలు
ఎన్నికలు సమీపిస్తుండడంతో అశోక్‌రాజు తాయిలాల పర్వానికి తెరతీశారు. పసుపు–కుంకుమ పేరుతో అధినేత ప్రజాధనంతో డ్వాక్రా సంఘాలకు తాయిలాల ఎరవేయగా, అదే బాటలో అశోక్‌రాజు సైతం మహిళలకు చీరలను తాయిలాలుగా అందిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చిన్న చిన్న కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నానని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అశోక్‌రాజు సామాజిక వర్గం నుంచి డాక్టర్ సుభాషిణి తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. నగరి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణకు ఆమె దరఖాస్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అధినేతను కలసి బయోడేటాను అందించారు. వైద్యురాలిగా తనకు పరిచయాలు, సామాజిక వర్గ మద్దతు ఉందని ఆమె చంద్రబాబు వద్ద వివరించినట్లు తెలిసింది. అధినేత కూడా డాక్టర్ సుభాషిణి గురించి పూర్తి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వమని సర్వే బృందాన్ని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment