ఎంపీ అవినాశ్‌రెడ్డిని బలవంతంగా పోలీస్ వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న దృశ్యం
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల అభివృద్ధిపై చర్చకైనా, రచ్చకైనా సిద్ధమని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం అన్నంత పనీ చేశారు. అధికార బలంతో రౌడీల్లా రెచ్చిపోయారు. పూల అంగళ్ల సర్కిల్ వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.
అసలేం జరిగింది..
పులివెందుల అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి ఫిబ్రవరి 28న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సవాల్ విసిరి మాటల యుద్ధం మొదలెట్టారు. ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించి ‘చర్చకు నేను సిద్ధం. ఎప్పుడు.. ఎక్కడికి పిలిచినా వస్తా’ అంటూ మార్చి 1న ప్రతి సవాల్ విసిరారు. పులివెందులలోని పూల అంగళ్ల సర్కిల్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు చర్చకు రావాలని సతీష్‌రెడ్డి అన్నారు. మళ్లీ శనివారం కడపలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, చర్చకైనా.. రచ్చకైనా సిద్ధమంటూ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు.
చర్చకు సహకరించాలని విజ్ఞప్తి
పులివెందుల రాజకీయం వేడెక్కడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో ఆదివారం ఉదయం నుంచే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల సమయంలో ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు ఎంపీ అవినాష్‌రెడ్డికి ఇంటికి వెళ్లి.. మీరు బయటికొస్తే శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి, బయటకు రావొద్దని అన్నారు. అయితే, తాను ఓల్డ్ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లాలని చెబుతూ అవినాష్‌రెడ్డి అక్కడికి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం పులివెందుల ఏఎస్పీ ఆధ్వర్యంలో మరోసారి అవినాష్‌రెడ్డితో చర్చించారు. అర్థవంతమైన చర్చ జరిగేందుకు సహకరించాలని ఆయన పోలీసులను కోరారు. అయినా పోలీసులు పట్టించుకోకుండా ఎంపీని అరెస్టు చేసి తరలించేందుకు జీపు వద్దకు తీసుకురాగా.. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు వెనుతిరిగారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ... అందరూ సంయమనం పాటించాలని కోరారు. చట్టాన్ని, పోలీసులను గౌరవించాలని, సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఉందామని అన్నారు.
రణరంగం సృష్టించిన టీడీపీ నేతలు
పులివెందులలో చర్చకు బయలుదేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిని వేంపల్లె పోలీసులు మధ్యాహ్నం అరెస్టు చేసి గృహనిర్బంధంలో ఉంచారు. అదే సమయంలో పులివెందులలో టీడీపీ నేతలు బీటెక్ రవి, రాంగోపాల్‌రెడ్డి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి పూల అంగళ్ల సర్కిల్‌కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఈలలు, కేకలు వేస్తూ రణరంగం సృష్టించారు. అక్కడున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేయగా.. ఈ దాడిలో ట్రాఫిక్ ఎస్‌ఐ చిరంజీవి గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం బాష్పవాయువు ప్రయోగించారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై లాఠీచార్జి
జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ పులివెందులకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పట్టణంలో 144 సెక్షన్ విధించినట్లు ప్రకటించారు. పూల అంగళ్ల సర్కిల్‌లో ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి కార్యకర్తలను లాఠీలతో చావబాదారు. ఈ ఘటనలో పార్టీ పట్టణ కన్వీనర్ వరప్రసాద్‌తోపాటు మరో ఇద్దరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. రాళ్ల దాడికి దిగిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
పక్కా ప్రణాళికతోనే టీడీపీ దాడి: అవినాష్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ నేతలు చర్చకు బదులు రచ్చ చేశారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ జరగాలన్న ఉద్దేశం సతీష్‌రెడ్డికి లేదని విమర్శించారు. టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడినా తాను, తమ పార్టీ కార్యకర్తలు చట్టాన్ని గౌరవించి సంయమనం పాటించామన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం ముందు వందలాది మంది పోలీసులు మోహరించారు, కానీ టీడీపీ కార్యాలయం వద్ద ఎందుకు పోలీసులను పెట్టలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు పక్కా ప్రణాళికతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు లభిస్తున్న ప్రజాదరణను చూసి అధికార పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. పులివెందుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment