తన స్వగృహంలో పోలీసు అధికారులతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల/ఎర్రగుంట్ల : మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి అధికార పార్టీ నేతలు పాతర వేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలను కాలరాస్తున్నారు. కనీసం తన నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతలను ప్రచారం సైతం చేయనీయకుండా అడ్డుకోవడం ఆయన అరాచకానికి పరాకాష్టగా నిలుస్తోంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె, సుగుమంచిపల్లెలలో శనివారం జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డితో కలిసి మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.దీనికి మూడు రోజుల క్రితమే వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసుల అనుమతి కోరారు. డీఎస్పీ కూడా షరతులతో అనుమతిచ్చారు. కాగా, శనివారం ఉ.5 గంటలకు డీఎస్పీ నాగరాజు, సీఐలు శంకరయ్య, రామకృష్ణుడు, ఎస్‌ఐలతోపాటు ఇతర సిబ్బందితో పెద్దఎత్తున పులివెందులలోని వైఎస్ అవినాష్‌రెడ్డి స్వగృహానికి చేరుకుని ఆయనను గృహ నిర్బంధం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని నిడుజివ్విలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డిని కూడా గృహ నిర్బంధం చేశారు. ఇద్దరు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు బలగాలు ఆయన ఇంటి వద్ద మోహరించాయి. అధికార టీడీపీ నేతలు చెప్పిందే వేదమన్నట్లుగా పోలీసులు వ్యవహరించారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన :అవినాష్‌రెడ్డి
టీడీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని పరిపాలన సాగిస్తోందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు.. తనను గృహ నిర్బంధం చేసిన సందర్భంగా వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంపీ అభ్యర్థిగా తనకు.. ఎమ్మెల్యే అభ్యర్థిగా సుధీర్‌రెడ్డికి ఆ గ్రామాలలో పర్యటించే హక్కు ఉందన్నారు. పోలీసుల అనుమతి కూడా తీసుకున్నా తమను హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆయా గ్రామాల ప్రజలను మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరులు ప్రలోభాలకు గురిచేసినా వారు లొంగకపోవడంతో చివరకు పోలీసులను అడ్డుపెట్టుకుని శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపి తనను సుధీర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారన్నారు. గతంలోనూ జమ్మలమడుగు నియోజకవర్గంలోని గొరిగెనూరు గ్రామానికి వెళ్లాల్సి ఉండగా.. ఇదే విధంగా అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు. అప్పుడు తాము హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసి తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. కాగా, తాము ఆయా గ్రామాలకు వెళ్లి కచ్చితంగా ప్రజలను కలుస్తామని అవినాష్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇందుకోసం అవసరమైతే హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment