Adhinarayana Reddy
-
మంత్రి ‘ఆది’ ఇలాకాలో స్వేచ్ఛకు సంకెళ్లు
పులివెందుల/ఎర్రగుంట్ల : మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి అధికార పార్టీ నేతలు పాతర వేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలను కాలరాస్తున్నారు. కనీసం తన నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలను ప్రచారం సైతం చేయనీయకుండా అడ్డుకోవడం ఆయన అరాచకానికి పరాకాష్టగా నిలుస్తోంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె, సుగుమంచిపల్లెలలో శనివారం జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డితో కలిసి మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.దీనికి మూడు రోజుల క్రితమే వైఎస్సార్సీపీ నాయకులు పోలీసుల అనుమతి కోరారు. డీఎస్పీ కూడా షరతులతో అనుమతిచ్చారు. కాగా, శనివారం ఉ.5 గంటలకు డీఎస్పీ నాగరాజు, సీఐలు శంకరయ్య, రామకృష్ణుడు, ఎస్‌ఐలతోపాటు ఇతర సిబ్బందితో పెద్దఎత్తున పులివెందులలోని వైఎస్ అవినాష్‌రెడ్డి స్వగృహానికి చేరుకుని ఆయనను గృహ నిర్బంధం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని నిడుజివ్విలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డిని కూడా గృహ నిర్బంధం చేశారు. ఇద్దరు సీఐలు, ఎస్ఐలు, పోలీసు బలగాలు ఆయన ఇంటి వద్ద మోహరించాయి. అధికార టీడీపీ నేతలు చెప్పిందే వేదమన్నట్లుగా పోలీసులు వ్యవహరించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన :అవినాష్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని పరిపాలన సాగిస్తోందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు.. తనను గృహ నిర్బంధం చేసిన సందర్భంగా వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంపీ అభ్యర్థిగా తనకు.. ఎమ్మెల్యే అభ్యర్థిగా సుధీర్‌రెడ్డికి ఆ గ్రామాలలో పర్యటించే హక్కు ఉందన్నారు. పోలీసుల అనుమతి కూడా తీసుకున్నా తమను హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆయా గ్రామాల ప్రజలను మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరులు ప్రలోభాలకు గురిచేసినా వారు లొంగకపోవడంతో చివరకు పోలీసులను అడ్డుపెట్టుకుని శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపి తనను సుధీర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారన్నారు. గతంలోనూ జమ్మలమడుగు నియోజకవర్గంలోని గొరిగెనూరు గ్రామానికి వెళ్లాల్సి ఉండగా.. ఇదే విధంగా అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు. అప్పుడు తాము హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసి తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. కాగా, తాము ఆయా గ్రామాలకు వెళ్లి కచ్చితంగా ప్రజలను కలుస్తామని అవినాష్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇందుకోసం అవసరమైతే హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
జూలైలో 35 టీఎంసీలు ఇస్తే రాజీనామా
సాక్షి ప్రతినిధి, కడప: అయ్యే పనులు చెప్పి, ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తాం.. జూలైలో 35 టీఎంసీల నీరు గండికోట, మైలవరం రిజర్వాయర్లులలో నిల్వ చేయగల్గితే పదవికి రాజీనామ చేస్తానని జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిని కలవడానికి వెళుతున్న అఖిల పక్షాన్ని పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో వారు విలేకర్లతో మాట్లాడారు. 2016 జూలైకి పూర్తి స్థాయిలో 35 టిఎంసీలు నీరు నిల్వ చేస్తే పదవికే కాదు రాజకీయాలకు సైతం దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పి వెళ్లడం సులువేనని తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నారు.. ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది.. ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుందామని పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకూ క్షేత్రస్థాయిలో పర్యటించాం. సిఎంకు నివేదించి ప్రాజెక్టు పూర్తికి కావాల్సిన నిధులపై నివేదిక ఇవ్వాలని చూస్తే పోలీసులతో ఎమ్మెల్యేల్ని అడ్డుకున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు లేకుండా ఇష్టానుసారం హామీలు గుప్పించడం సరైంది కాదని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. మాటలు కాదు, చేతుల్లో అభివృద్ధి చూపించాలన్నారు. చెప్పింది చేసే ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే చెల్లిందన్నారు. ఆయన చేసిన పనులు అందుకు నిదర్శనమన్నారు. ధనయజ్ఞం అని మాట్లాడ్డం కాదని రూ.3800 కోట్లు జిఎన్ఎస్ఎస్ పనులు చేపట్టారని అవే పనులు చంద్రబాబు రూ.6వేల కోట్లతో చేసి చూపించాలని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఉర్దూ యూనివర్శిటి ఏర్పాటు కడప, గుంటూరు, కర్నూల్ అంటూ ఎక్కడికక్కడ ప్రకటిస్తూ జిల్లాల మధ్య తగాదాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కలెక్టర్‌పై ఎమ్మెల్యేలు ధ్వజం... ముఖ్యమంత్రి సమావేశానికి హాజరు కావాల్సిన ప్రజాప్రతినిధులుగా ఆహ్వానం పంపిన జిల్లా కలెక్టర్ పోలీసులతో అడ్డగించడం హక్కులకు భంగం కల్గించడమే అని ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, రవీంద్రనాథరెడ్డి ధ్వజమెత్తారు. అందరూ ఆహ్వానితులేనంటూ ప్రకటించి ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన తమకు అవకాశం లేదు, ప్రజలు తిరస్కరించిన వారికి అవకాశం కల్పిస్తారా అని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖూనీ చేశారని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపించారు. జిల్లా ఎమ్మెల్యేలంటే చంద్రబాబుకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలకు సేవ చేయాలనే తపనతో చంద్రబాబు మెలగాలని ఎమ్మెల్యేలు హితవు పలికారు. -
వైఎస్సార్సీపీకే లక్కు
జమ్మలమడుగు: జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికలో అదృష్టం వైఎస్సార్సీపీని వరించింది. ఛైర్‌పర్సన్‌గా తాతిరెడ్డి తులసి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన ముల్లాజానీ ఎన్నికయ్యారు. ఆదివారం ఛైర్పర్సన్,వైస్‌చైర్మన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా ఇన్చార్జి కలెక్టర్ రామారావు, ఎన్నికల పరిశీలకునిగా సందీప్‌కుమార్ సుల్తానియా వ్యవహరించారు. ఉత్కంఠరేపిన ఎన్నిక.. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు సంబంధించిన ఎన్నికలో వైఎస్సార్సీపీ తరపున చైర్పర్సన్ అభ్యర్థిగా తాతిరెడ్డి తులసి నామినేషన్ దాఖలు చేయగా టీడీపీ నుంచి జె. లక్ష్మీమహేశ్వరి నామినేషన్ వేశారు. ఛైర్పర్సన్ అభ్యర్థిగా టి.తులసిని తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ప్రతిపాదించగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బలపరిచారు. అలాగే టీడీపీ తరపున లక్ష్మీమహేశ్వరిని రాజేశ్వరి ప్రతిపాదించగా రామచంద్రుడు బలపరిచారు. ఇరువురికి 11 ఓట్లు సమానంగా రావడంతో ప్రిసైడింగ్ అధికారి రామారావు లాటరీ ద్వారా ఎన్నిక జరుగుతుందని అభ్యర్థులకు సూచించారు. దీంతో ఇరువురి పేర్లను ఐదు చీటీల్లో రాసి డబ్బాలో వేసి లాటరీ తీశారు. ఈ విధానంలో తులసి పేరు రావడంతో ఆమెనే ఛైర్‌పర్సన్‌గా ప్రకటించారు. అదేవిధంగా వైస్ చైర్మన్‌గా లాటరీ పద్ధతిలో టీడీపీకి చెందిన ముల్లాజానీ ఎన్నికయ్యారు. మున్సిపాలిటి అభివృద్ధికి కృషి చేస్తా- ఛైర్పర్సన్ తులసి జమ్మలమడుగు మున్సిపాలిటి అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ఛైర్పర్సన్ టి.తులసి పేర్కొన్నారు. చైర్పర్సన్ ఎన్నిక అనంతరం ఆమె విలేకరులతోమాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఐదు మండలాలు ,రెండు మున్సిపాలిటీలు, ఆరు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడినా చివరకు న్యాయం తమ వైపే ఉండటంతో ఛైర్పర్సన్ పదవి తమకే దక్కిందని చెప్పారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింతగా మెరుగైన సేవ చేసేందుకు అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఆమె తెలిపారు. -
వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బుధవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సమైక్యాంధ్ర కోసం హైదరాబాద్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 'సమైక్య దీక్ష' శిబిరం వద్దకు వెళ్లి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఆదినారాయణ రెడ్డి తన మద్దతుదారులతో కలసి భారీ సంఖ్యలో తరలివెళ్లి జగన్‌ను కలిశారు. సమైక్యాంధ్ర కోసం జగన్ చేపడుతున్న దీక్షకు సంఘీభావం తెలుపుతూ వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయన వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.