సాక్షి ప్రతినిధి, కడప: అయ్యే పనులు చెప్పి, ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తాం.. జూలైలో 35 టీఎంసీల నీరు గండికోట, మైలవరం రిజర్వాయర్లులలో నిల్వ చేయగల్గితే పదవికి రాజీనామ చేస్తానని జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిని కలవడానికి వెళుతున్న అఖిల పక్షాన్ని పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో వారు విలేకర్లతో మాట్లాడారు.
2016 జూలైకి పూర్తి స్థాయిలో 35 టిఎంసీలు నీరు నిల్వ చేస్తే పదవికే కాదు రాజకీయాలకు సైతం దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పి వెళ్లడం సులువేనని తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నారు.. ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది.. ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుందామని పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకూ క్షేత్రస్థాయిలో పర్యటించాం.
సిఎంకు నివేదించి ప్రాజెక్టు పూర్తికి కావాల్సిన నిధులపై నివేదిక ఇవ్వాలని చూస్తే పోలీసులతో ఎమ్మెల్యేల్ని అడ్డుకున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు లేకుండా ఇష్టానుసారం హామీలు గుప్పించడం సరైంది కాదని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. మాటలు కాదు, చేతుల్లో అభివృద్ధి చూపించాలన్నారు. చెప్పింది చేసే ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే చెల్లిందన్నారు. ఆయన చేసిన పనులు అందుకు నిదర్శనమన్నారు. ధనయజ్ఞం అని మాట్లాడ్డం కాదని రూ.3800 కోట్లు జిఎన్‌ఎస్‌ఎస్ పనులు చేపట్టారని అవే పనులు చంద్రబాబు రూ.6వేల కోట్లతో చేసి చూపించాలని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఉర్దూ యూనివర్శిటి ఏర్పాటు కడప, గుంటూరు, కర్నూల్ అంటూ ఎక్కడికక్కడ ప్రకటిస్తూ జిల్లాల మధ్య తగాదాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
కలెక్టర్‌పై ఎమ్మెల్యేలు ధ్వజం...
ముఖ్యమంత్రి సమావేశానికి హాజరు కావాల్సిన ప్రజాప్రతినిధులుగా ఆహ్వానం పంపిన జిల్లా కలెక్టర్ పోలీసులతో అడ్డగించడం హక్కులకు భంగం కల్గించడమే అని ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, రవీంద్రనాథరెడ్డి ధ్వజమెత్తారు. అందరూ ఆహ్వానితులేనంటూ ప్రకటించి ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన తమకు అవకాశం లేదు, ప్రజలు తిరస్కరించిన వారికి అవకాశం కల్పిస్తారా అని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖూనీ చేశారని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపించారు. జిల్లా ఎమ్మెల్యేలంటే చంద్రబాబుకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలకు సేవ చేయాలనే తపనతో చంద్రబాబు మెలగాలని ఎమ్మెల్యేలు హితవు పలికారు.
జూలైలో 35 టీఎంసీలు ఇస్తే రాజీనామా
Published Sat, Feb 28 2015 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement
Advertisement