వైఎస్సార్‌సీపీకే లక్కు
జమ్మలమడుగు: జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికలో అదృష్టం వైఎస్సార్‌సీపీని వరించింది. ఛైర్‌పర్సన్‌గా తాతిరెడ్డి తులసి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన ముల్లాజానీ ఎన్నికయ్యారు. ఆదివారం ఛైర్‌పర్సన్,వైస్‌చైర్మన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా ఇన్‌చార్జి కలెక్టర్ రామారావు, ఎన్నికల పరిశీలకునిగా సందీప్‌కుమార్ సుల్తానియా వ్యవహరించారు.
ఉత్కంఠరేపిన ఎన్నిక..
మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు సంబంధించిన ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తరపున చైర్‌పర్సన్ అభ్యర్థిగా తాతిరెడ్డి తులసి నామినేషన్ దాఖలు చేయగా టీడీపీ నుంచి జె. లక్ష్మీమహేశ్వరి నామినేషన్ వేశారు. ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా టి.తులసిని తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ప్రతిపాదించగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బలపరిచారు. అలాగే టీడీపీ తరపున లక్ష్మీమహేశ్వరిని రాజేశ్వరి ప్రతిపాదించగా రామచంద్రుడు బలపరిచారు. ఇరువురికి 11 ఓట్లు సమానంగా రావడంతో ప్రిసైడింగ్ అధికారి రామారావు లాటరీ ద్వారా ఎన్నిక జరుగుతుందని అభ్యర్థులకు సూచించారు. దీంతో ఇరువురి పేర్లను ఐదు చీటీల్లో రాసి డబ్బాలో వేసి లాటరీ తీశారు. ఈ విధానంలో తులసి పేరు రావడంతో ఆమెనే ఛైర్‌పర్సన్‌గా ప్రకటించారు. అదేవిధంగా వైస్ చైర్మన్‌గా లాటరీ పద్ధతిలో టీడీపీకి చెందిన ముల్లాజానీ ఎన్నికయ్యారు.
మున్సిపాలిటి అభివృద్ధికి కృషి చేస్తా- ఛైర్‌పర్సన్ తులసి
జమ్మలమడుగు మున్సిపాలిటి అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ఛైర్‌పర్సన్ టి.తులసి పేర్కొన్నారు. చైర్‌పర్సన్ ఎన్నిక అనంతరం ఆమె విలేకరులతోమాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ఇప్పటికే నియోజకవర్గంలోని ఐదు మండలాలు ,రెండు మున్సిపాలిటీలు, ఆరు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడినా చివరకు న్యాయం తమ వైపే ఉండటంతో ఛైర్‌పర్సన్ పదవి తమకే దక్కిందని చెప్పారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింతగా మెరుగైన సేవ చేసేందుకు అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఆమె తెలిపారు.