
సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారి చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కొంత మంది స్వప్రయోజనాల కోసం తమను బలిపశువులను చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఈ క్రమంలో... విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని మరోసారి ఆశించిన మీసాల గీత... ఆ టికెట్‌ను అశోక్ గజపతి రాజు కూతురు అదితి గజపతిరాజుకు కేటాయించడంతో కంగుతిన్నారు. అదితి కోసం బీసీ నేతనైన తనను బలిచేశారన్న ఆమె.. స్వతంత్ర అభ్యర్థిగా రెండు రోజుల్లో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కనిగిరి టికెట్ ఆశించిన తనను దర్శి నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశించడంతో కదిరి బాబూరావు తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. దర్శి టికెట్ వద్దంటూ టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన బాబూరావు.. కనిగిరి నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.(‘అనంత’ టీడీపీలో భగ్గుమన్న సెగలు)
ఈ క్రమంలో వీరి కోవలోనే మరికొంత మంది టీడీపీ నేతలు కూడా రెబల్స్‌గా రంగంలోకి దిగనున్నారు. సర్వేల్లో తనకు ఫస్ట్‌ర్యాంక్ ఇచ్చి ఇప్పుడు మొండిచేయి చూపారని చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళనైన కారణంగా మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్ తనను టార్గెట్ చేసి.. టికెట్ రాకుండా కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న పీతల సుజాత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కల్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కూడా వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ఉమామహేశ్వర నాయుడుకు టికెట్ ఇవ్వడంతో కలత చెందిన ఆయన ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.(చంద్రబాబు సెల్ఫ్ గోల్..)
ఇక శింగనమల(ఎస్సీ) సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీ బాలకు కూడా చంద్రబాబు మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. తన స్థానంలో ఏమాత్రం రాజకీయ అనుభవం లేని బండారు శ్రావణిని అభ్యర్థిగా ప్రకటించారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు బుధవారం భవిష్యత్ నిర్ణయం ప్రకటించనున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా శింగనమలలో తాను చెప్పిన అభ్యర్థినే నిలబెట్టాలని పట్టుబట్టిన జేసీ దివాకర్‌రెడ్డి ఆమేరకు విజయం సాధించారు. కానీ మిగతా చోట్ల ఆయన మాట చెల్లుబాటు కాకపోవడంతో జేసీ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment