
సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయంగా పెనుమార్పులు వస్తాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. ‘‘అప్పుడు దేశ రాజకీయాల్లో టీడీపీదే కీలకపాత్ర. దేశంలో టీడీపీ గెలవడం చారిత్రక అవసరం’’అన్నారు. టీడీపీతో పెట్టుకున్న ఎవరికై నా కరెంట్‌షాక్ కొడుతుందని హెచ్చరించారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ టీడీపీ మహానాడు జరిగింది. బాబు ముఖ్య అతిథిగా మాట్లాడారు.
తెలంగాణ, ఏపీలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు చేసిందేమీ లేదంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘అవినీతిని కేంద్రం నియంత్రించలేకపోయింది. జీఎస్టీ అమల్లోనూ విఫలమైంది. నోట్ల రద్దుతో ఏటీఎంలలో డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు పెరిగాయి. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో గిరిజన వర్సిటీ, స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఏమీ చేయలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు’’అని అన్నారు. తెలుగు ప్రజలంటే బీజేపీకి ఎందుకంత కోపమని ప్రశ్నించారు.
తెలంగాణలోనూ ‘కర్ణాటక’ పునరావృతం
‘‘నేనెక్కడున్నా నా మనసు తెలంగాణ కార్యకర్తలపైనే ఉంటుంది. వారికి సమయం కేటాయిం చలేకపోతున్న బాధ నాకుంది. అయినా కార్యకర్తలు ధైర్యంగా ఉంటున్నారు. కార్యకర్తలు ఎన్నికల దాకా నిద్రపోకుండా పని చేయాలి. కొండవీటి సింహంలా, బొబ్బిలిపులిలా, సైనికుడిలా కష్టపడి చరిత్ర సృష్టించాలి. ఆర్నెల్లలో టీడీపీ బలం పుంజుకుని తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. కర్ణాటకలో జరి గిందే తెలంగాణలో పునరావృతమవుతుంది’’అని బాబు వ్యాఖ్యానించారు.
కాగా, మహానాడులో 8 తీర్మానాలను ఆమోదించారు. మహానాడుకు సీనియర్ తెలంగాణ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఆర్.కృష్ణయ్య హాజరుకాలేదు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన జరిగిన మహానాడులో దేవేం దర్‌గౌడ్, వెంకటవీరయ్య, నామా, గరికపాటి, రావుల, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంతా నా వల్లే!
బాబు స్వోత్కర్షకు మహానాడు వేదికైంది. ‘‘40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. దేశంలోకెల్లా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిని నేనే. తెలంగాణలో సేవా రంగం ద్వారా రూ. 3.21 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందంటే నేను దూరదృష్టితో చేసిన అభివృద్ధి వల్లే. సైబరాబాద్ ఏర్పాటు చేసింది నేనే. మెట్రో రైలు తెచ్చిందీ నేనే. హైదరాబాద్‌లో మతకల్లోలాలు నిర్మూలించిందీ నేనే. రోడ్డు వెడల్పు కార్యక్రమం నా సృష్టే. ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చా.
నన్ను ప్రధాని కావాలని 22 ఏళ్ల క్రితమే అడిగారు. కానీ నాకే కావాలని లేదు. తెలుగు ప్రజలకు సేవచేసే భాగ్యం శాశ్వతంగా ఉంటే చాలు. నేను ఏర్పాటు చేసిన నాలెడ్జ్ అకాడమీ వల్లే జేఈఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు 20 శాతం సీట్లు సాధించారు. మెట్‌పల్లి విద్యార్థి సివిల్స్ టాపర్ కావడం, శ్రీకాకుళం విద్యార్థి జేఈఈ టాపర్ కావడం, అమెరికా సహా విదేశాల్లో తెలుగు వారు ఎక్కువ ఉండటానికి కారణమూ టీడీపీ దూరదృష్టితో చేసిన కృషి, అభివృద్ధి ఫలితమే’’అని చెప్పుకొచ్చారు.
నన్ను ఆహ్వానించరా?: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: మహానాడుకు తనను కనీసం ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అవమానపరచడం బాధగా ఉందన్నారు. ‘‘నన్నింత చిన్న చూపు చూస్తరా? ఒక సీనియర్ దళిత నేతకు ఇచ్చే గౌరవమిదేనా?’’అని ప్రశ్నించారు. ‘‘నేను వాస్తవాలు మాట్లాడా. తర్వాత క్షమాపణలూ చెప్పా. అయినా నన్ను పార్టీపరంగా పట్టించుకోకపోవడం దారుణం’’అని అన్నారు. ‘‘మహానాడుకు వెళ్లే అదృష్టం నాకు లేదు. ఎన్టీఆర్‌తో కలిసి పని చేశా.
అధికారం లేకపోయినా, బాబు దగ్గర పని చేసిన మంత్రులంతా పరారైనా, 15 ఏళ్లు ఆయన కోసం, పార్టీ కోసం పని చేశా. నేను ఏ బ్యాక్‌గ్రౌండూ లేనివాడిని. ‘నర్సింహులూ... నువ్వు నాకు తోడుగా ఉండు’అన్నందుకు ఆయనకు అండగా ఉన్నా. టీడీపీ అధికారంలోకి రాదని, టీఆర్‌ఎస్ వస్తుందని బాబు, నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం. నాకు రాజ్యసభ ఇస్తనన్నరు. అధికారం కోసం, టికెట్ కోసం టీడీపీలోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేసిండ్రు. అతను పార్టీని భ్రష్టు పట్టించి, మొత్తంగా కాంగ్రెస్‌లో కలుపుతానన్నా మందలించలేదు.
సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌తో పొత్తు అసాధ్యమని, టీఆర్‌ఎస్‌తోనే అయితదని చెప్పిన. ఇప్పుడూ చెబుతున్నా. తప్పా? నా నేరమేందో, ఏం పాపం చేసిన్నో అర్థం కాలే. మా నాయకుడు కూడా నన్ను అవమాన పరిస్తే దిక్కెవరు? చెప్పుకుంటే సిగ్గుపోతది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడతది. మూడేళ్ల నుంచి అడుగుతున్నా ఐదు నిమిషాలు టైం ఇవ్వలేదు. నన్ను అవమానించడం భావ్యం కాదు. నన్ను పిలవండి. మీ ప్రేమ అందించండి. పార్టీని బతికించుకుందాం’’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment