
పట్నా : ఆర్జేడీ చీఫ్ లాలూ కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ జేడీయూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని చెప్పారు. తనకు ప్రాణ భయం ఉందనీ, రక్షణ కల్పించాలని నితీష్ ప్రభుత్వాన్ని కోరారు. ‘రోజు హత్యలు, అల్లర్లతో పరిస్థితులు భయానకంగా మారాయి. ఎవరు ఎవరినైనా చంపొచ్చు. నాకు ప్రాణ భయం ఉంది. రక్షణ కల్పించండి’అని మీడియా సమావేశంలో జేడీయూ ప్రభుత్వాన్ని కోరారు. సెక్యురిటీగా బాడీగార్డులు ఉన్నా ప్రాణలకు గ్యారంటీ లేదని అన్నారు. అంతగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. (నాయకుడి హత్య... నిందితుడి కొడుకు బలి)
ఇక మంగళవారం రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి చెందిన ఇందాల్ పాశ్వాన్ అనే నాయకుడి హత్య నలందాలో అల్లర్లకు కారణమైంది. గడిచిన వారం రోజుల్లో ఇటువంటి మూడు ఘటనలు చోటుచేసుకోవడంతో నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఇందాల్ మృతికి కారకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి ఇంటికి బుధవారం కొందరు నిప్పంటించారు. అంతేకాకుండా అతడి కొడుకు (13)ను తీవ్రంగా కొట్టడంతో ఆ బాలుడు మృతిచెందాడు. దీంతో నలందాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, గత ఆదివారం బిహార్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఔరంగాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిని కాల్చిచంపడంతో పాటు నాలుగు బస్సులను తగులబెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని పేర్కొంటూ రాజధాని పట్నాలో విపక్షాలు నిరసనలు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment