
పట్నా: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్జేడీ విద్యార్థి విభాగం అధ్యక్ష పదవికి గురువారం ఆయన రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తేజ్‌ప్రతాప్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే రాజీనామాకు గల కారణాలు తెలియలేదు. ఎవరి పేరు ప్రస్తావించకుండా ‘అమాయకులే నన్ను అమాయకుడని అనుకుంటారు. కానీ గ్రౌండ్ లెవల్‌లో అందరి గురించి, అన్ని విషయాలు తెలుసు’అంటూ ట్వీట్ చేశారు.
(చదవండి: ‘విడాకుల యుద్ధం.. భారతం కన్నా పెద్దది’)
దాణా కుంభకోణంలో లాలూ జైలులో ఉండటంతో ప్రస్తుతం తేజ్‌ప్రతాప్ సోదరుడు తేజస్వీ యాదవ్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. గతంలో పార్టీ నాయకులు తనను పట్టించుకోవడం లేదని తేజ్‌ప్రతాప్ యాదవ్ బాహాటంగానే ప్రకటించారు కూడా. ఇలా చెబుతూనే తన సోదరుడికి తనకు ఎలాంటి విబేధాలు లేవని తన తమ్ముడు తన హృదయానికి దగ్గరగా ఉంటారని చెప్పారు. తేజస్వీ యాదవ్ కూడా తన అన్నే తనకు మార్గదర్శకుడని తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్న తేజ్‌ప్రతాప్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
(‘ప్రాణభయం ఉంది.. రక్షణ కల్పించండి’)