
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల్లో అంతులేని అవినీతి జరుగుతోందని, ప్రాజెక్టులపై పెడుతున్న పెట్టుబడి రాష్ట్ర ప్రజలమీద భారంగా మారుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ శాసన సభాపక్షం (సీఎల్పీ) డిమాండ్ చేసింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో సీఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయాలు, జీవో 39, భూసర్వే, గ్రామాల్లో విషజ్వరాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం లో జాప్యం, దళితులకు భూపంపిణీ, డీఎస్సీ నోటిఫికేషన్ జారీలో జాప్యం, అధికారులపై టీఆర్‌ఎస్ నేతల దాడులు తదితర అంశాలపై చర్చ జరిగింది. సీఎల్పీ భేటీ వివరాలను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మండలిలో సీఎల్పీ డిప్యూటీ లీడర్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. రైతు సమన్వయ సమితులను కేవలం టీఆర్‌ఎస్ కార్యకర్తలతోనే నింపారని, సీఎల్పీ దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తుందని చెప్పారు. భూ ప్రక్షాళనకోసం అనేక ప్రకటనలు చేశారని వాస్తవంగా అమలుజరగడం లేదని విమర్శించారు.
జనగామ ఎమ్మెల్యే ఎకరం భూమి కబ్జాచేస్తే కలెక్టర్ రద్దు చేశారని, ప్రభుత్వం మాత్రం ఎమ్మెల్యేపై ఎటువంటి చర్య తీసుకోలేదని అన్నారు. పరిగిలో టీఆర్‌ఎస్ నేత హరీశ్వర్‌రెడ్డి సైతం తన కుమారుడి పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో దళిత బాధితుల పరామర్శకోసం మీరాకుమార్ వస్తే అనుమతి ఇవ్వలేదని, దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ పెన్షన్ విధానంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సచివాలయాన్ని బైసన్ పోలో గ్రౌండ్స్‌కి మార్చడానికి అంగీకరించమన్నారు. సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ సంఘానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎల్పీలో చర్చించామన్నారు. అధికారులపై జరుగుతున్న భౌతిక దాడులు, హత్యలను సీఎల్పీ ఖండించిందని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు పొడుస్తూ రైతు సమన్వయ సమితుల ఏర్పాటును కాంగ్రెస్ తప్పు పడుతోందన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపకంలో జరిగిన అవకతవకల వల్ల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయని సమావేశం ఆందోళన వెలిబుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment