సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ శాసన మండలిలో సుమారు ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో టీఆర్‌ఎస్ పక్షాన శాసన మండలికి ఎన్నికైన ఆర్.భూపతిరెడ్డి పార్టీ ఫిరాయించారనే కారణంతో గత ఏడాది జనవరి 16న మండలి చైర్మ న్ అనర్హత వేటు వేశారు. 2022, జనవరి 4 వరకు నిజామాబాద్ కోటా శాసన మండలి సభ్యుడి పదవీ కాలం ఉండటంతో ఖాళీని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 12న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23వ తేదీ నామినేషన్ల ఉప సంహరణకు గడువు కాగా, ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఏప్రిల్ 7వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రి ల్ 9న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. ఏప్రిల్ 13లోగా నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment