సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం(ఫిబ్రవరి3) ఎక్స్(ట్విటర్)లో కేటీఆర్ ఒక కీలక ట్వీట్ చేశారు. ‘సుప్రీంకోర్టు గత తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పైన వేటు పడుతుందని,ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ కాపాడడం అసాధ్యమని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యే వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు(KTR) వేసిన పిటిషన్ విచారణ సోమవారం వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు.
అయితే ఫిరాయింపులపై బీఆర్‌ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఫిరాయింపుదారుల మీద వేటు ఖాయమని, ఉప ఎన్నికలకు సిద్ధమవండని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునివ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
బీఆర్‌ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment