రెండో విడత ప్రాదేశిక పోలింగ్‌ నేడే  | telangana Second Phase Elections ZPTC And MPTC Election | Sakshi
Sakshi News home page

రెండో విడత ప్రాదేశిక పోలింగ్‌ నేడే 

Published Fri, May 10 2019 7:31 AM | Last Updated on Fri, May 10 2019 7:31 AM

telangana Second Phase Elections ZPTC And MPTC Election - Sakshi

పోలింగ్‌ సామగ్రి పంపిణీ కేంద్రంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ప్రాదేశిక ఎన్నికల సమరం–2 నేడు జరగనుంది. ఈ విడతలో అడ్డాకుల, దేవరకద్ర, కోయిల్‌కొండ, సీసీకుంట, మహబూబ్‌నగర్‌ రూరల్, మూసాపేట్, హన్వాడ మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. 7 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు గాను 318 మంది బరిలో నిలిచారు. ఇందులో జెడ్పీటీసీ స్థానాలకు 30 మంది, ఎంపీటీసీ స్థానాలకు 288 బంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రమే ప్రచారం ముగిసింది.
 
437 పోలింగ్‌ కేంద్రాలు..
రెండో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో మొత్తం 437 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో అత్యధికంగా దేవరకద్రంలో 80 పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. కోయిల్‌కొండలో 79 కేంద్రాలు, సీసీ కుంటలో 67, హన్వాడలో 65, మహబూబ్‌నగర్‌లో 65, మూసాపేట్‌లో 39 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
 
2,30,383 ఓటర్లు 
రెండోవిడతలో జరిగే ఎన్నికల్లో 7 మండలాలకు కలుపుకుని మొత్తం 2,30,383 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యధికంగా కోయిల్‌కొండలో 44,959 ఓటర్లు, అత్యల్పంగా మూసాపేట మండలంలో 19,852 ఓటర్లు కాగా అడ్డాకులలో 22,339, సీసీకుంటలో 33,677, దేవరకద్రలో 41,884, హన్వాడలో 35,160, మహబూబ్‌నగర్‌లో 32,512 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

16 గ్రామాలు, 62 పోలింగ్‌ స్టేషన్లు 
జిల్లాలో రెండో విడత జరిగే గ్రామాల్లో మొత్తంగా 16 గ్రామాలు, 62 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఈ పోలింగ్‌ స్టేషన్లను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. ఇందుకోసం సమస్యాత్మక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. మిగిలిన 16 గ్రామాల్లో మైక్రొ అబ్జర్వర్లను నియమించారు. వీరు నిరంతరం ఎన్నికల సరళిని పరిశీలించి ఉన్నతా«ధికారులకు పరిస్థితిని చేరవేస్తుంటారు.

సీసీకుంటలో 23 సమస్యాత్మక కేంద్రాలు 
రెండో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో సీసీ కుంటలో 23 అత్యధికంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. హన్వాడలో 14, దేవరకద్రలో 13, అడ్డాకులలో 10, కోయిల్‌కొండలో 3 సమస్మాత్మక పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఈ విడత ఎన్నికలు జరిగే  మహబూబ్‌నగర్, మూసాపేట్‌ మండలాల్లో ఎలాంటి సమస్యాత్మ గ్రామాలు కాని, పోలింగ్‌స్టేషన్లు కాని లేవు. రెండో విడతలో 91 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుతున్నాయి. ఇందుకోసం 437 పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేశారు. వీటిని 209 లోకేషన్లలో ఏర్పాటు చేశారు. మొత్తంగా 2,30,383 ఓటర్లు ఉన్నారు.  
2581 పోలింగ్‌ సిబ్బంది 
రెండోవిడత కోసం మొత్తం 2,581 పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. వారికి ఇదివరకే పోలింగ్‌ శిక్షణను ఇచ్చారు. పీఓలు 437, ఏపీఓలు 437 మంది ఉండగా ఇతర పోలింగ్‌ అధికారులు 1,707 మందితోపాటు 12 శాతం సిబ్బందిని రిజర్వులో ఉంచారు. అత్యవసర సమయంలో వీరికి ఉపయోగించుకోనున్నారు. అందుకు వారిని ముందుకుగా ఎంపిక చేసి సిద్ధంగా ఉంచారు. 

పోలింగ్‌ సామగ్రి పంపిణీ 
జిల్లాలో జరిగే ఏడు మండలాల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి ఆయా మండల కేంద్రాల్లో పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ ప్రక్రియను కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ పరిశీలించారు. ఎన్నికలకు అవసరమయ్యే సామగ్రిలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్‌ సామాగ్రితో వెళ్లే అధికారులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించారు.
 
గుర్తింపు కార్డు తప్పనిసరి 
ఓటు వేసేందుకు ఓటర్లు కచ్చితంగా ఏదో ఒక గుర్తింపు కార్డును కచ్చితంగా పోలింగ్‌ కేంద్రానికి తీసుకుని పోవాల్సి వస్తుంది. 
ఎన్నికల సంఘం 28 రకాల గుర్తింపు కార్డులు తీసుకుపోవచ్చని సూచించింది. అందులో ఓటర్‌ గుర్తింపు కార్డు, ఆదార్‌ కార్డు,  బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, పొలానికి చెందిన పట్టాదారు పాస్‌పుస్తం, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, కిసాన్‌ కార్డు లాంటివి కచ్చితంగా ఉండాలి.
ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి ఎంపీటీసీకి, రెండోది జెడ్పీటీసీకి. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 

  

జిల్లాలో రెండే విడతలు 
రెండోవిడత ప్రాదేశిక ఎన్నికలు శుక్రవారంతో ముగియనున్నాయి. దీంతో జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియనుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు విడతల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. 
మొదటి విడుతలో 7 మండలాలకు, రెండోవిడతలో ఏడు మండలాల్లో ఎన్నికల జరిగాయి. దీంతో జిల్లాలో ఎన్నికలు పరిపూర్ణం కానున్నాయి.  ఇక ఓట్ల లెక్కింపు కోసం మరో 17 రోజుల పాటు వేచి చూడాల్సిందే. 27వ తేదీన ఫలితాలు వస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement